ఎలాంటి పరీక్షలు లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు- నలుగురి అరెస్ట్
Fake Jobs: ఆయుష్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన నలుగురు నిందుతులను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు.
Fake Jobs: నిరుద్యోగుల ఆశను పెట్టుబడిగా చేసుకొని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పరీక్షలు రాయకుండా, ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా కేవలం డబ్బు చెల్లిస్తే చాలు ప్రభుత్వ ఉద్యగాల్లో చేరవచ్చని చెప్తూ అమాయక యువతకి గాలం వేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో రూ. లక్షల్లో దండుకుని చడీ చప్పుడు లేకుండా జారుకుంటున్నారు.
వరంగల్ జిల్లాలో ఆయుష్మాన్ పథకం కింద స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల్లో వసూలు చేశారు కొందరు వ్యక్తులు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోడంతో మోసపోయామని గ్రహించిన పలువురు యువతీ యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సలాడి రాంగోపాల్, అంకాలు సుభాష్, ధర్మవరం ప్రసాద్, రజనీ ఒక ముఠాగా ఏర్పడి ఈ దందాకు తెరలేపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకపు యువతను మోసం చేయడం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వేలల్లో జీతాలు అంటూ కళ్లబొల్లి మాటలు చెప్పి లక్షల్లో దోచేశారు. ఇంటర్వ్యూలు, పరీక్షలు ఏం అవసరం లేకుండా నేరుగా ఉద్యోగం పొందవచ్చని కలరింగ్ ఇచ్చారు. ఇలా చెప్పేసరికి చాలా మంది వీరిని నమ్మి అడిగినంతా డబ్బులు చెల్లించారు.
డబ్బులు చెల్లించిన వారికి నమ్మించేందుకు ఫేక్ కాల్‌లెటర్లు, అపాయింట్‌మెంట్ లెటర్‌లు కూడా ఇచ్చేవాళ్లు. ఎక్కడా బాధితులకు అనుమానం రాకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో మరికొంత మంది కూడా వీళ్ల మోసాలకు అట్రాక్ట్ అయ్యారు. రోజులు గడిచే కొద్ది కేటుగాళ్లపై అనుమానం రావడం మొదలైంది.
బాధితుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో రోజులు మారుతున్నాయి కానీ ఉద్యోగాల్లో జాయినింగ్స్ లేకపోవడంతో అనుమానం పెరిగింది. చాలా రోజులుగా అటు ఉద్యోగం ఇప్పించకపోవడంతో నిలదీయడం మొదలెట్టారు. ఏదో కహానీలు చెబుతూ వచ్చినప్పటికీ చెల్లుబాటు కాలేదు. చివరకు డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలెట్టారు బాధితులు. కానీ అటు నుంచి సమాధానం లేదు. ఉద్యోగాలు రాక, డబ్బులు తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ముఠా గుట్టు తెలుసుకొని నిందుతులు రామ్ గోపాల్, ప్రసాద్, సుభాష్, రజనీని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షా పది వేల రూపాయల నగదుతో పాటు ఫేక్ కాల్ లెటర్స్, అపాయింట్ మెంట్ లెటర్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు దొచేసిన సొమ్మును జల్సాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
విచారణలో విస్తుపోయే నిజాలు..
విచారణలో సలాడి రామ్ గోపాల్ అనే నిందితుడు మీద రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 20 కేసులు నమోదు అయిట్లు పోలీసులు గుర్తించారు. ఇతడు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నమోదైన పీడీ యాక్ట కింద జైలుకు కూడా వెళ్లాడు. అయితే ఇలాంటి మోసాలపై యువత చాలా జాగ్రత్తగా ఉండాలని వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబందించిన నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి.. ఇలాంటి మోసాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని... కాబట్టి నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డబ్బులు కడితే ఎలాంటి ఉద్యోగం రాదని, కష్టపడి చదివితేనే మీరు ఏదైనా సాధించగలరని చెప్పారు. అలాగే నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు.