Warangal News: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కు యువకుడు బలి, స్నేహితులే మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో!
Warangal News: ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కారణంగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నమ్మిన స్నేహితులే మోసం చేశారంటూ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
Warangal News: వరంగల్ లో ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కు ఓ యువకుడి బలి అయ్యాడు. పది లక్షల వరకూ మోసపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు.. నమ్మిన వాళ్లే తనను మోసం చేశారంటూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్ పల్లికి చెందిన రామకృష్ణ అనే యువకుడు హన్మకొండలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లకు అలవాటు పడ్డాడు. అలా ప్రతిరోజూ గేమ్స్ ఆడుతూ దాదాపు 10 లక్షల వరకూ పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ రామకృష్ణ ఈరోజు మృతి చేందాడు. అయితే ఆత్మహత్య చేసుకోబోవడానికి ముందు.. నమ్మిన స్నేహితులే నన్ను మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలో ఏముందంటే..?
"నా పేరు రామకృష్ణ. నేను గత నాలుగు నెలల నుంచి చాలా సఫర్ అవుతున్న. దానికి కారణం ఆన్ లైన్ బెట్టింగ్. నేను హన్మకొండ లెన్ స్కార్ట్ లో జాబ్ చేస్తున్న. ఇంటి కాడి నుంచి రావడం, పోవడం ఇబ్బంది ఐతదని హన్మకొండ రెవెన్యూ కాలనీలో రూంలో ఉంటున్న. నా పక్క రూంలో మా ఊరు అతను నగేష్ ఉండేవాడు. నేను దాదాపు 6 మంత్స్ అక్కడే ఉన్నాను. ఎవరి వర్క్ వాళ్లదే. నా వర్క్ నాదే. తన వర్క్ తనదే. ఒకరోజు అనెక్స్ పెక్టెడ్ గా ఐపీఎల్ స్టార్ట్ అయింది. బెట్టింగ్ వేద్దామని చెప్పి నగేష్ ఓ గేమ్ చూపిచ్చాడు. అతనే చూపిచ్చాడు. ముందు యాప్ డౌన్ లోడ్ చేస్కొని బెట్టింగ్ వేయమని. 300, 400 అట్ల ఒక ఐదారు రోజులు వేశాము. డబ్బులు ఎప్పుడూ రాలేదు. దాని గురించి నాకు తెలియక గేమ్ నేను ఆపేశాను. సడెన్ గా మళ్లీ ఒకరోజు వచ్చి ఇంకో గేమ్ వేశాడు. దాని వల్ల దాదాపు లక్ష రూపాయల వరకు మోసపోయాను. అదే విషయం అతడికి చెప్పి గేమ్ డిలీట్ చేసిన. కొన్నాళ్ల తర్వాత మళ్లీ కొత్త గేమ్ లింక్ పంపిండు. ఏంటని అడిగితే.. రూంకు వెళ్లాక నా ఫోన్ లో ఇన్ స్టాల్ చేశాడు. 300 రూపాయలు పెట్టి ఆడిపిచ్చిండు. అలా ఆడుతూ ఆడుతూ దాదాపు 10 లక్షల వరకు మోసపోయాను. అప్పుల బాధ తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నాను?. - రామకృష్ణ
ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని పాండవ బస్తీలో సాయి కృష్ణ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సాయి కిషన్ బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటపడ్డాడు. ఆన్లైన్ గేమ్ లలో బెట్టింగులు వేసి అప్పులు కావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిషన్ తండ్రి కూడా గతంలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయి కిషన్ మృతితో ఆ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.