Vizianagaram News: రైలు పట్టాలపై కూతురు పరుగులు, కాపాడబోయిన తండ్రితో సహా పాప మృతి!
Vizianagaram News: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం సరిగ్గా లేని కూతురు రైలు పట్టాలపై పరిగెడుతుండగా.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా అదే రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
Vizianagaram News: విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని కూతురు రైలు పట్టాలపై పరుగులు తీస్తుండగా... రైలు రాకను గమనించిన తండ్రి ఆమె వెంటే పరిగెట్టాడు. కాపాడేందుకు ఎంతో ప్రయత్నించి అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. గజపతి నగరం మండలం మధుపాడ వద్ద శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో లింగాల వలసకు చెందిన బెల్లాన తవుడు (36), ఆయన కుమార్తె శ్రావణి (12) మృతి చెందారు. విజయనగరం జీఆర్పీ ఎస్సై రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మధుపాడలోని చుట్టాల ఇంటికి వచ్చిన తవుడు, కుమార్తె శ్రావణిని ద్విచక్ర వాహనంపై స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లారు. మతిస్థిమితం లేని ఆ చిన్నారి రైలు పట్టాల వెంబడి పరుగు తీసింది.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు..
రైలు రాకను గుర్తించిన తండ్రి ఆమె వెంటే పరుగులు పెట్టాడు. కాపాడేందుకు చాలా ప్రయత్నించారు. అయితే విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న రైలు ఢీకొని ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తవుడుకు ఇద్దరు కుమార్తెలు కాగా.. చిన్నమ్మాయి విజయలక్ష్మి నాలుగో తరగతి చదువుతోంది. భార్య భారతితో పాటు వృద్ధులైన తల్లి రాములన్న, తండ్రి అప్పల నాయుడులకు ప్రస్తుతం ఆసరా లేకుండా పోయింది.
కడపలో రెండు బైకులు ఢీ - ముగ్గురి దుర్మరణం
కడప జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్క రోడ్డు ప్రమాదం మూడు కుంటుంబాలను రోడ్డున పడేసింది. చేతికి అంది వచ్చిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయి.. ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి.
కడప శివావురలోని స్పిరిట్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వేర్వేరు బైకుల్లో వెళ్తున్న నలుగురు యువకులు.. ఒకరికొకరు ఎదురుగా వస్తున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వారి కోసం అంబులెన్స్ లకు ఫోన్ చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులను కూడా పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరో యువకుడు కూడా మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే యువకుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబాలకు సమాచారం అందించారు పోలీసులు. అయితే ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన వారిలో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు.