Narsipatnam Fire Accident: బంగారం షాపులో తండ్రీ కొడుకు సజీవదహనం, త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు
అంబికా జ్యూవెల్లర్స్ అనే బంగారం దుకాణం ఉన్న భవనంలో షార్ట్ సర్య్కూట్ జరిగి ఆదివారం తెల్లవారుజామున పెద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన అగ్ని ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. నర్సీపట్నం పట్టణంలోని స్థానిక కృష్ణ బజార్ సెంటర్‌లో ఓ బంగారం దుకాణంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అంబికా జ్యూవెల్లర్స్ అనే బంగారం దుకాణం ఉన్న భవనంలో షార్ట్ సర్య్కూట్ జరిగి ఆదివారం తెల్లవారుజామున పెద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వారిద్దరూ తండ్రీ కుమారుడు కావడం గమనార్హం. కుటుంబంలో పెద్ద దిక్కుతో పాటు, కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
అంబికా జ్యువెల్లర్స్ బంగారం దుకాణం ఉన్న పై అంతస్తులో షాపు యజమాని అయిన మల్లేశ్వర రావు, ఆయన ఫ్యామిలీ నివాసం ఉంటోంది. షార్ట్ సర్య్కూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగడంతో తండ్రి మల్లేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు మౌలేష్ అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మిగిలిన ఇద్దరు మల్లేశ్వరరావు భార్య, మరో కుమారుడు తప్పించుకోగలిగారు. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. వారు మంటలను అదుపు చేశారు. కానీ, అప్పటికే తండ్రీ కొడుకులు సజీవ దహనం అయ్యారు. క్షతగాత్రులను వెంటనే విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అది, పాత భవనం కావడం, వైరింగ్ వ్యవస్థ కూడా పాతది కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే షాపు యాజమాని మల్లేశ్వరరావు.. తన సోదరుడుకి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. కాస్త దూరంలో ఉండే సోదరుడు వెంటనే అక్కడికి చేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే మంటలు, పొగ తీవ్రంగా వ్యాపించడంతో ఊపిరాడక మల్లేశ్వరరావు, ఆయన కొడుకు మౌలేష్ ప్రాణాలు కోల్పోయారు. భార్యతో పాటు కుమార్తెకు కాస్త కాలిన గాయాలు కావడంతో వారిని విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, ఆటో లారీ ఢీ
కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.
సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పొట్లదుర్తి గ్రామానికి చెందిన భార్య భర్తలైన సిరంగి దస్తగిరి (45), సిరంగి సరస్వతి (35) అనారోగ్యం కారణంగా వైద్యం కోసం ఆటోలో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామానికి వెళ్లారు. తిరిగి పోట్లదుర్తి గ్రామానికి వస్తుండగా ముద్దనూరు వద్దకు రాగానే తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ప్రమాదంలో దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ పట్నం ప్రేమ్ కుమార్ తీవ్ర గాయాలయ్యాయి. 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.