Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
Couple Died With Heart Attack: ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో నవదంపతులు గుండెపోటుతో మృతిచెందారు. పెళ్లైన గంటల సమయంలోనే విగతజీవులుగా మారారు.
![Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట Uttar Pradesh News Newly Married Couple Dies Of Heart Attack On Wedding Night In UP Bahraich Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/04/5b7b9fe330f2ef7c887b4ee004411bb41685894941936754_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Couple Died With Heart Attack: పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. సుఖసంతోషాల మధ్య ఇద్దరు కలిసి కొత్త బంధాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. కానీ విధి మాత్రం వారిని వంచించింది. నూతన వధూవరులు తమ తొలి రాత్రి మధుర క్షణాలను ఊహించుకుంటూ సంబరపడ్డారు. ఉదయం వారిద్దరూ లేచి గది నుంచి బయటకు వెళ్లే సరికి కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సరదాగా ఆటపట్టించాలని ఎదురుచూడసాగారు. కానీ తెల్లవారుజామున అనుకోని వార్తతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మూడు ముళ్లతో ఒక్కటై కొన్ని గంటలు కూడా గడవకముందే.. ఆ నవ దంతులు విగత జీవులుగా మారారు. ఈ విషాదకర ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది.
శోభనం గదిలోకి వెళ్లారు, విగతజీవులుగా మారారు
22 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుష్ప మే 30న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి రోజు రాత్రి ఇద్దరూ శోభన గదిలోకి వెళ్లారు. వెళ్లిన వారి గది నుంచి మరుసటి రోజు ఉదయం అవుతున్నా.. ఉలుకు పలుకు లేదు. ఇంటి సభ్యులు పిలిచినా అటు నుంచి సమాధానం రాలేదు. ఎంతకీ గది తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా లోపలికి వెళ్లగా ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇద్దరూ ఒకేసారి ఎలా చనిపోయారు?
నవ దంపతులు ఇద్దరూ ఒకే రోజు చనిపోవడంతో అనేక అనుమానాలు చుట్టు ముట్టాయి. శోభనం కోసం గదిలోకి వెళ్లి వారు తిరిగి రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇద్దరినీ ఎవరో కుట్ర పూరితంగా హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తలుపులు లోపలి నుంచి వేసి ఉన్నప్పుడు ఎవరైనా లోపలికి వెళ్లి ఎలా హత్య చేశారన్న ప్రశ్నలు తలెత్తాయి. అలాగే శోభనం గదిలో అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదు. అన్నీ వస్తువులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఎవరైనా లోపలికి వచ్చి చంపేముందు ప్రతిఘటన జరిగినట్లుగా కూడా ఏమీ కనిపించలేదు. భార్యాభర్తల మృతదేహాలు మంచంపై ఉన్నాయి. దీంతో నవ దంపతులు ఎలా చనిపోయారన్న అనుమానాలు మరింతగా పెరిగాయి.
పోస్టుమార్టం రిపోర్టుతో క్లారిటీ
నవ దంపతులు మృతదేహాలకు పోస్టు మార్టం చేసిన రిపోర్టు రావడంతో అన్ని పుకార్లకు తెరపడింది. కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని బహ్రైచ్ జిల్లా ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇద్దరి వయస్సు 25 ఏళ్లకు తక్కువే. ఇంత చిన్న వయస్సులో గుండె పోటు రావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నవదంపతుల మృతదేహాలను కుటుంబసభ్యులు గ్రామంలో ఒకే చితిపై దహనం చేశారు. పెళ్లి బంధంతో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారనుకున్న నవ దంపతులు ఇలా చనిపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వీరి అంతిమ సంస్కారాలకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మే 30వ తేదీన జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)