(Source: ECI/ABP News/ABP Majha)
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి
UP Crime News: యూపీలో ఓ వ్యక్తి ఫ్రెండ్ మరణాన్ని తట్టుకోలేక ఆ చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
UP Man Jumps into Funeral Pyre:
యూపీలో ఘటన..
క్యాన్సర్‌తో పోరాడి ఫ్రెండ్ చనిపోయాడు. ఒక్కసారిగా పిచ్చోడైపోయాడు. "వాడు లేక నేను బతికేదెలా" అనుకున్నాడు. స్నేహితుడికి చితి పెట్టిన వెంటనే తానూ ఆ మంటల్లో దూకాడు. ప్రాణాలతో పోరాడి చనిపోయాడు. హృదయాన్ని కదిలించే ఈ ఘటన యూపీలో జరిగింది. యమునా నదీ తీరంలో దహన సంస్కారాలు చేస్తున్న క్రమంలోనే ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆ చితిలోకి దూకాడు. శరీరానికి మంటలు అంటుకున్నాయి. ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఎలాగోలా కష్టపడి చుట్టూ ఉన్న వాళ్లంతా మంటలు ఆర్పారు. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలొదిలాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నగ్లా ఖంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 42 ఏళ్ల అశోక్ చాన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. ఇటీవలే కన్ను మూశాడు. యమునా నదీ తీరంలో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. మృతుడి క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్...అశోక్ మరణాన్ని తట్టుకోలేకపోయాడు. దహనం అయిపోగానే అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఆనంద్ మాత్రం అక్కడే నిలబడి చితిని చూస్తూ ఉండిపోయాడు. కాసేపయ్యాక వస్తాడులే అనుకుని అందరూ వెళ్లిపోయారు. ఇంతలోనే ఆనంద్ ఆ చితి మంటల్లోకి దూకాడు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే పరిగెత్తుకొచ్చారు. మంటల్లో నుంచి బయటకు తీసి అతి కష్టం మీద ఆర్పారు. కానీ అప్పటికే అతని శరీరం పూర్తిగా కాలిపోయింది. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే చనిపోయాడు.
గతంలో ఒడిశాలో..
సతీసహగమనం వినే ఉంటారు... భర్త చనిపోతే భార్య కూడా ఆ చితిలో తనను తాను దహనం చేసుకునే ప్రక్రియ. కానీ ఒడిశాలో పతీసహగమనం జరిగింది. భార్య చనిపోయిందన్న నిజాన్ని విని తట్టుకోలేకపోయాడు. ఇక తనతో ఉండదనే బాధను దిగమింగలేకపోయాడు. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. మూడు ముళ్ల బంధానికి మృత్యువే ముగింపు అనుకున్నాడు. భార్య మృతదేహం కాలుతున్న చితిలో అమాంతం దూకేశాడు. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె చితిలోకి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన 2021 ఆగస్టులో ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలోని సియాల్జోడి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని నీలమణి సబర్ (65)గా పోలీసులు గుర్తించారు. అతని భార్య రైబారి (60) గుండెపోటుతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలకు తన నలుగురు కుమారులతో పాటు నీలమణి సబర్ హాజరయ్యారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో సబర్ చితిలో దూకేశాడు. చితికి నిప్పంటించాక పక్కనే ఉన్న నీటి మడుగు వద్దకు నలుగురు కుమారులు, బంధువులు స్నానానికి వెళ్లిన సమయంలో ఆయన చితిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయన చితిలో కాలిపోయి మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇనాళ్లు కష్టసుఖాలు పంచుకున్న భార్య లేదనే నిజాన్ని నమ్మలేక ఆ వృద్ధుడు ఈ పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.