Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Telangana News: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతిని రక్షించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితురాలి వైద్య ఖర్చులు తానే భరిస్తానని భరోసా ఇచ్చారు.
Union Minister Bandi Sanjay Humanity: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని వైద్యులకు తెలిపారు. హుజూరాబాద్ (Huzurabad) సమీపంలోని సింగాపూరం సమీపంలో యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో యువతి లారీ కింద ఇరుక్కోగా స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో డ్రైవర్ లారీని ఆపాడు. అదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్ ఆపారు. లారీ కింద టైర్ పక్కన రాడ్డులో యువతి జుట్టు చిక్కుకుంది. దీంతో అటువైపు వెళ్తున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. ధైర్యంగా ఉండాలని యువతికి ధైర్యం చెప్పారు.
అనంతరం యువతి జుట్టు కత్తిరించి స్థానికులు ఆమెను రక్షించారు. యువతిని బయటకు తీసి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని.. ఖర్చులు తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. సకాలంలో స్పందించి యువతి ప్రాణాలు కాపాడిన కేంద్ర మంత్రిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం ములుగు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గట్టమ్మను దర్శించుకుని ములుగు కలెక్టరేట్‌లో సమీక్షలో పాల్గొన్నారు.
Also Read: Basara IIIT: బాసర ట్రిపుల్ల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..