(Source: ECI/ABP News/ABP Majha)
Vijayawada: టికెట్ కౌంటర్ పక్కనే ఉద్యోగం - ఫేక్ రైల్వే వెబ్‌సైట్‌తో మోసం- ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లు జాగ్రత్త!
Railway Jobs: రైల్వేస్టేషన్లలో ఏవీటీఎం మెషిన్ల వద్ద ఫెసిలేటర్ల ఉద్యోగాల పేరటి నకిలో నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారు.బెజవాడలో బాధితులు లబోదిబోమంటున్నారు.
Andhra Pradesh Fake Jobs Scam: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మోసం చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు డబ్బులు తీసుకుని కనిపించకుండాపోవడం వరకే మనం చూశాం...ఇప్పుడు మోసగాళ్లు మరింత తెలివిమీరారు. ఏకంగా రైల్వేశాఖ( Indian Railway) నోటిఫికేషన్ పోలిన ఫేక్ నోటిఫిషన్(Fake Notification) ఆన్‌లైన్‌లో విడుదల చేయడమేకాదు..అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఏకంగా లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారు.
రైల్వే ఉద్యోగాల పేరిట వల
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే నిరుద్యోగులు ఎగబడటం ఆసరాగా చేసుకుని మోసగాళ్లు భారీ కుట్రకు తెరతీశారు. రైల్వే ఉద్యోగాల (Railway Jobs)కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏకంగా రైల్వేశాఖ(Indian Railway) పేరిట నకిలీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వేశాఖలో ఎంక్వైరీ చేసినా ఎవరూ పెద్దగా సమాచారం ఇవ్వకపోవడం...శాఖాపరంగానూ దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వారికి కలిసొచ్చింది. రైల్వే నోటిఫికేషన్(Job Notification) మాదిరిగానే ఫేక్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది నిజమని నమ్మి ధరఖాస్తు చేసుకున్న వారి నుంచి పెద్దసంఖ్యలో డబ్బులు వసూలు చేశారు. అనంతరం వారికి నకిలీ కాల్‌లెటర్లు సైతం పంపించారు. తీరా ఉద్యోగంలో చేరదామని స్టేషన్‌కు వెళ్లినవారికి అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు.
బెజవాడలో బాధితులు
రైల్వేస్టేషనల్లో టిక్కెట్ కౌంటర్ వద్ద రద్దీని నియంత్రించేందుకు బయట ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషిన్‌లను(ATVM) యంత్రాలను ఏర్పాటు చేశారు. వాటి వద్ద ఉండి ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే ఉద్యోగాల కోసం విజయవాడ(Vijayawada) డివిజన్ పరిధిలోని 26రైల్వేస్టేషన్ల పరిధిలో 59 ఉద్యోగాలకు ఇటీవల రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు రంగంలోకి దిగారు. రైల్వేశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుదోవ పట్టించేలా అవి రెగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలని నమ్మబలికి మోసానికి పాల్పడ్డారు. అందుకోసం ఏకంగా బోగస్ వెబ్‌సైట్(Fake Website)లను సృష్టించి....నిరుద్యోగులకు గాలం వేశారు. అసలు నోటిఫికేషన్ బదులు నకిలీ నోటిఫికేషన్ అందులో ఉంచి...దరఖాస్తులు వారే స్వీకరించారు. ఒక్కో పోస్టు కోసం లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్‌గాకే ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఉద్యోగాలే ఉన్నాయంటూ నిరుద్యోగులను నమ్మబలికారు. త్వరలోనే వాటికి కూడా నోటిఫికేషన్ రానుందంటూ ఆశ చూపారు. ముందుగానే డబ్బులు కట్టి ఉద్యోగాన్ని అట్టిపెట్టుకోవాలని తొందరపెట్టడంతో చాలామంది దళారులకు నగదు ముట్టజెప్పారు. వీరికి రైల్వేశాఖలోని కొందరు సిబ్బంది సైతం సహకరించినట్లు తెలిసింది. రైల్వే ఉద్యోగులే హామీ ఇవ్వడంతో....చాలామంది అభ్యర్థులు తల్లిదండ్రులు అప్పులు చేసి...ఆస్తులు అమ్మి వారికి నగదు చెల్లించారు. డబ్బులు కట్టిన వారంతా విజయవాడ(Vijayawada) స్టేషన్‌కు చేరుకుని ఉద్యోగాల గురించి వాకబు చేస్తుండటంతో అసలు విషయం బయటపడింది.
రైల్వేశాఖ వివరణ
అయితే రైల్వేశాఖ మాత్రం తాము ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని...ఏటీవీఎం(ATVM) యంత్రాల వద్ద పనిచేసేందుకు ఫెసిలేటర్లు కావాలంటూ తాము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగల భర్తీకోసం కాదని తేల్చి చెప్పింది. ఆ ఫెసిలేటర్ ఉద్యోగం అసలు ఫర్మినెంట్ ఉద్యోగమే కాదని..వారికి జీతాలు ఇవ్వడం కానీ, ప్రయోజనాలు కల్పించడం గానీ జరగదన్నారు. కేవలం రైల్వేశాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం మాత్రమే ఆ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. వారు అమ్మిన టిక్కెట్ల డబ్బులు ఆధారంగా వారికి అందులో నుంచి కేవలం 3 శాతం కమిషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. అది కూడా కేవలం 150 కిలోమీటర్ల దూరం ఉన్న స్టేషన్ల వరకు మాత్రమే ఈ మెషిన్ల ద్వారా టిక్కెట్లు జారీ అవుతాయన్నారు. కాబట్టి వారికి వచ్చే కమీషన్ సైతం నామమాత్రంగానే ఉటుందని..దీనిలో పెద్దగా సంపాదన ఏమీ ఉండదన్నారు. ఇలాంటి ఫెసిలేటర్ ఉద్యోగాలు కేవలం రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు మాత్రమే చేస్తారన్నారు. వారికి సంస్థపై ఉన్న అభిమానం, ఇన్నేళ్లు అక్కడే పనిచేసిన అనుభవం ఉండటంతో వారు సంస్థను వీడలేక...కమీషన్ సొమ్ము తక్కువగా ఉన్నా ఆ పని చేస్తుంటారని తెలిపింది. దీన్ని నమ్ముకుని నిరుద్యోగులు లక్షలాది రూపాయలు చెల్లించి మోసపోవద్దని సూచించింది.