Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..
Hyderabad News: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అధిక లాభం ఆశ చూపి ఇద్దరి నుంచి రూ.2.42 కోట్లు కొట్టేశారు. బాధితుల్లో ఓ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Cyber Crime In Hyderabad: స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులకు భారీ లాభాల పేరుతో ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.42 కోట్లు కొట్టేశారు. బాధితుల్లో ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఉన్నారు. ఈయన వ్యక్తిగత రుణం తీసుకుని మరీ నేరగాళ్లకు డబ్బు పంపారు. చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఫోన్ నెంబరును గుర్తు తెలియని వ్యక్తులు డిసెంబర్ చివరి వారంలో ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. స్టాక్ ట్రేడింగ్ చేస్తే బాగా డబ్బు సంపాదించొచ్చని.. తాము సలహాలు ఇస్తామని నమ్మబలికారు. ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త వారు చెప్పినట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో ఉన్న యాప్ డౌన్ లోడ్ చేశాడు. షేర్లు కొనుగోలు చేసి నాలుగైదు రోజుల తర్వాత మంచి ధర రాగానే విక్రయించాలని సూచించారు. అలా షేర్లు కొనుగోలు చేయించి డబ్బులు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు.
రుణం తీసుకుని మరీ..
అయితే, తొలిసారి షేర్లు కొన్నందుకు శాస్త్రవేత్తకు రూ.50 వేల లాభం వచ్చింది. దీంతో ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త భారీగా లాభాలు వస్తాయని డిసెంబర్ 24 నుంచి 18 రోజుల వ్యవధిలోనే 16 లావాదేవీల్లో 1.22 కోట్లు నేరగాళ్లకు పంపించాడు. ఈ క్రమంలో వ్యక్తిగత రుణం తీసుకుని మరీ డబ్బు సర్దుబాటు చేశాడు. పెట్టుబడి లాభంతో కలిపి మొత్తం రూ.3.26 కోట్లకు చేరగా.. నకిలీ యాప్‌లో వర్చువల్‌గా కనిపించినా విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వాట్సాప్ ద్వారా సంప్రదించగా ఇప్పుడే విత్‌డ్రా వద్దని.. లాభం ఇంకా రావాలంటే డబ్బులు ఇంకా పెట్టుబడి పెట్టాలని నేరగాళ్లు సూచించారు. దీంతో డబ్బు విత్‌డ్రాకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తే.. అదనంగా రూ.కోటి పంపాలని డిమాండ్ చేశారు. దీంతో శాస్త్రవేత్త సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
రూ.10 వేలు ఆశ చూపి..
అలాగే, సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి ఓ ప్రైవేట్ ఉద్యోగి సైతం డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇంటి దగ్గరుండి పని చేస్తూ డబ్బు సంపాదించొచ్చని ఆశ పెట్టిన నేరగాళ్లు సదరు ఉద్యోగి నుంచి రూ.1.20 కోట్లు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీలో నివాసం ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి (31) వాట్సాప్‌నకు.. తాము ఇచ్చే టాస్కులు పూర్తి చేస్తే రోజువారీగా డబ్బులు జమ చేస్తామని మెసేజ్ వచ్చింది. దీంతో ఆశపడ్డ అతను కొన్ని టాస్కులు పూర్తి చేయగా.. నేరగాళ్లు చెప్పినట్లుగానే పెట్టుబడి పెట్టాడు. తొలిసారి రూ.10,500 పెట్టగా.. లాభంతో కలిపి రూ.15,200 తిరిగి పంపారు. రెండోసారి బాధితుడు రూ.50 వేలు పంపగా.. తిరిగి రూ.65,100 వచ్చినట్లు ఓ వెబ్‌సైట్‌లో వర్చువల్‌గా చూపించారు.
లాభం రావడంతో డిసెంబర్ 6 నుంచి జనవరి 7వ తేదీ వరకూ దఫదఫాలుగా రూ.1.20 కోట్లు పంపించాడు. దీనికి రూ.14.83 లక్షలు లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపించిన నేరగాళ్లు విత్ డ్రాకు అవకాశం ఇవ్వలేదు. అదనంగా డబ్బులు పంపించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

