Money Scam: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల మోసం - పోలీసులను ఆశ్రయించిన బాధితులు
Telangana News: అధిక వడ్డీ ఆశ చూపి 517 మంది వద్ద దాదాపు రూ.200 కోట్లు డిపాజిట్లు సేకరించిన అబిడ్స్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ మోసానికి పాల్పడింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Two Hundred Crores Money Fraud In Abids Private Enterprise: 'మా సంస్థలో పెట్టుబడి పెడితే మార్కెట్ రేటు కంటే అధిక వడ్డీ చెల్లిస్తాం.' ఇలాంటి మాటలు నమ్మిన చాలా మంది సామాన్యులు తాము కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రైవేట్ సంస్థల్లో డిపాజిట్ చేసి మోసపోతున్నారు. తాజాగా, హైదరాబాద్ లో మరో మోసం వెలుగుచూసింది. అబిడ్స్ లోని శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి.. అందరితో డిపాజిట్లు చేయించుకుని దాదాపు రూ.200 కోట్ల మేర మోసం చేసింది. దాదాపు 517 మంది నుంచి డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసింది.
బ్యాంక్ మేనేజర్‌దే కీలక పాత్ర
ఈ స్కామ్ లో ఓ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పని చేస్తోన్న మహిళ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బ్యాంక్ సమీపంలోనే ఉన్న తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి తర్వాత ముఖం చాటేసినట్లు సమాచారం. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.