YS Viveka Murder Case : పులివెందుల నుంచి కడపకు మార్పు - ఇక వివేకా కేసు తేలేది అక్కడే !
వివేకా హత్య కేసు విచారణను పులివెందుల కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు మార్చారు. ఇక నుంచి కడప కేంద్రంగానే సీబీఐ అధికారులు విచారణ జరుపుతారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ( YS Vivekanamda Reddy ) ఇక నుంచి కడప కేంద్రంగా విచారణ జరగనుంది. హత్య కేసు పులివెందుల కోర్టు నుండి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. సీబీఐ అధికారుల ( CBI Officers ) అభ్యర్థన మేరకు కేసును కడప జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ పులివెందుల కోర్టు ( Pulivendula Court ) మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వివేకా హత్య కేసు విచారణ, రిమాండ్, వాయిదాలు, బెయిలు అంశాలు అన్నీ కడప జిల్లా కోర్టులోనే జరగే విధంగా ఆదేశించారు. పులివెందుల కోర్టుకు మంగళవారం నలుగురు నిందితులు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ( Devireddy Siva Sankar Reddy ) మాత్రం హాజరు కాలేదు. వీరందరికీ సీబీఐ అభియోగ పత్రాల వివరాలను మెజిస్ట్రేట్ తెలియజేశారు.
ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి కొంత మంది పులివెందుల.. మరికొంత మంది కడప కేంద్రంగా విచారణ జరిపేవారు. పులివెందుల కోర్టు పరిధిలోకి వస్తూండటంతో అక్కడే విచారణ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు దస్తగిరి ( Dastagiri ) అప్రూవర్‌గా మారినందున కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఇలాంటి సమయంలో పులివెందులలో కన్నా కడప నుంచి విచారణ జరపడం మేలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. సీబీఐ విజ్ఞప్తికి కోర్టు అంగీకరించడంతో ఇక నుంచి కడప కేంద్రంగా సీబీఐ విచారణ కొనసాగిస్తుంది.
వివేకా కేసులో సీబీఐ దూకుడుగా విచారణ జరుపుతోంది. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో ఆయనతో మరోసారి పులివెందుల కోర్టులో వాంగ్మూలం ఇప్పించారు. అప్రూవర్‌గా మారక ముందు ఇచ్చినస్టేట్ మెంట్ ఆధారంగా సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని ( MP Avinash Reddy ) ప్రధాన నిందితునిగా అనుమానిస్తూ చార్జిషీట్ ( Chargesheet ) దాఖలు చేసింది. ఈ క్రమంలో దస్తగిరి రెండో సారి ఇచ్చిన వాంగ్మూలంలో ఏముందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆ వాంగ్మూలం ఆధారంగా సీబీఐ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వైఎస్ వివేకానందరెడ్డి ( YS Viveka ) మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు కావడంతో రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసుగా మారింది. ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా వైఎస్ కుటుంబీకులే కావడంతో వివాదం మరింత ముదురుతోంది. కేసు దర్యాప్తు కీలక దశలోకి రావడంతో ఎప్పుడు ఎలాంటి విషయాలు సంచనాలు వెలుగులోకి వస్తాయా అనిరాజకీయవర్గాలు కూడా ఉత్కంఠకు గురవుతున్నాయి.