Tirupati Crime : లగ్జరీ దొంగ, పగలు రైల్వే స్టేషన్ ఏసీ హాల్ లో బస, రాత్రుళ్లు తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు!
Tirupati Crime : ఆ దొంగ లైఫ్ స్టైలే వేరు. పగలంతా రైల్వే స్టేషన్ లోని ఏసీ వెయిటింగ్ హాల్ లో బస రాత్రైతే దొంగతనాలు. అలా వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయండ అతడి స్టైల్. ఈ వెరైటీ దొంగను ఎల్.హెచ్.ఎం.ఎస్ పట్టించింది.
Tirupati Crime : తిరుపతి నగరంలో రాత్రి అయితే చాలు దొంగలు రెచ్చి పోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు అంతరాష్ట్ర దొంగలు. తాజాగా జైల్ నుంచి విడుదలైన మూడు రోజులుకే తిరుపతికి చేరుకుని దొంగతానికి పాల్పడిన దొంగను ఎల్.హెచ్.ఎం.ఎస్(లాక్డ్ హౌస్ మానటరింగ్ సిస్టమ్) పట్టించింది.
తిరుపతి ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల మేరకు... తిరుపతి నగరంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనానికి పాల్పడే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా కర్మాన్ ఘాట్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన వంశీధర్ రెడ్డి పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత జాల్సాలకు అలవాటు పడిన వంశీధర్ రెడ్డి దొంగతనాలనే వృత్తిగా నమ్ముకున్నాడు. చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో లైఫ్ ఎంజాయ్ చేసేవాడు. ఇలా దాదాపుగా 56 కేసుల్లో వంశీధర్ రెడ్డి నిందుతుడిగా ఉన్నాడంటే దీని బట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇతను పగలంతా రైల్వే స్టేషనులోని ఏసీ వెయిటింగ్ హాల్ లో ఉంటూ, రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడే వాడు. అంతే కాకుండా దొంగతనం చేసిన డబ్బును లగ్జరీగా ఖర్చు పెట్టేవాడు. కేవలం లగ్జరీ లైఫ్ అనుభవించేందుకే వంశీధర్ రెడ్డి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అయితే ఇతను మే 10న దొంగతనం కేసులో ఖమ్మం జైలుకు వెళ్లాడు. అనంతరం ఈ నెల 8వ తేదీన దొంగతనం కేసులో శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యాడు. తరువాత తిరుపతికి చేరుకున్నాడు.
పట్టించిన ఎల్.హెచ్.ఎం.ఎస్
ఈనెల 11వ తేదీ తెల్లవారు జామున గోపాల్ రాజు కాలనీలోని మంజునాథ్ శర్మ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డాడు. ఆ ఇంట్లో ఏ నగదు దొరక్క పోవడంతో దేవుడి దగ్గర ఉన్న హుండీలో ఉన్న సుమారు రెండు వేల రూపాయల చిల్లర నాణేలను దొంగలించాడు. ఆ ఇంటిలో ఏమి దొరక్కపోవడంతో అదే కాలనీలో నివాసం ఉంటున్న మురళి ఇంట్లో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అయితే మురళి ఊరికి వెళ్లే సమయంలో ఎల్.హెచ్.ఎం.ఎస్( లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టం) పోలీసులకు చెప్పి అమర్చుకున్నారు. వంశీధర్ రెడ్డి ఇంట్లో చోరీ చేసే ప్రయత్నం చేస్తుండగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో అప్రమత్తమైన పోలీసులు మురళి ఇంటి వద్దకు వచ్చి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నంచేశారు. అయితే పోలీసుల రాకను గమనించిన వంశీధర్ రెడ్డి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.1800 స్వాధీనం చేసుకున్నారు.
మరో దొంగను పట్టించిన పాప్లైన్ డివైన్
తిరుపతి ఆటో నగర్ కు చెందిన వెంకటేష్(27) తాళం వేసిన ఇళ్లు టార్గెట్ చేస్తూ దొంగతనాలు పాల్పడేవాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి నగరంలోని భవాని నగర్ లో నివాసం ఉన్న శ్రీనివాసరావు ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించిన పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా తుడా సర్కిల్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకొని పాప్లైన్ డివైస్ ద్వారా చెక్ చేయగా నేరస్తుడిగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. అతని వద్ద నుండి ఈ కేసుకు సంబంధించిన 50 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిపై ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో 20 కేసులకు పైగా ఉన్నట్లు గుర్తించారు.