Tirupati News: గంజాయి రవాణా చేస్తున్న కానిస్టేబుల్, సినీ ఫక్కీలో పట్టుకున్న ఖాకీలు !
Tirupati News: అక్రమాలను అడ్డుకోవాల్సిన ఓ పోలీసే.. డబ్బుపై ఆశతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు. బంధువులను రంగంలోకి దిగి అక్రమాలు చేయిస్తూ... పోలీసులకు చిక్కాడు.
Tirupati News: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజు రోజుకీ గంజాయి అక్రమ రవాణా పెరిగి పోతుంది. అడ్డ దారిలో సులభతరంగా డబ్బు సంపాదించేందుకు కొందరు గంజాయి స్మగ్లర్లు పోలీసులు సిబ్బందితో చేతులు కలిపి గంజాయి వ్యాపరాన్ని సాగిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా నుంచి చిత్తూరుకు గంజాయి అక్రమ రవాణా చేస్తూ రేణిగుంటకు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్, అతని సమీప బంధువులను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి యాభై వేల రూపాయలు విలువ చేసే 3.6 కేజీల గంజాయిని, ఆరు లక్షల రూపాయలు విలువ చేసే కారును చిత్తూరు టూ టౌన్ పోలిసులు స్వాధీనం చేసుకున్నారు.
కారును వెంబడించి మరీ పట్టుకున్న పోలీసులు..
చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు బృందాలుగా ఏర్పాటు చేసి, తరచూ పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చిత్తూరు పట్టణ శివారు ప్రాంతంమైన కాణిపాకం క్రాస్ వద్ద చిత్తూరు టూ టౌన్ పోలీసులు తనిఖీ చేపడుతున్న సమయంలో తిరుపతి నుంచి చిత్తూరు వైపుగా వస్తున్న ఓ కారు ఆపకుండా పోలీసులు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు కారును వెంబడించి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టింది. అందలో ఉన్న 3.6 కేజీల గంజాయితోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూసింది.
సులభంగా డబ్బులు సంపాదించేందుకు అక్రమాలు..
గంజాయి అక్రమ రవాణాలో ప్రధాన ముద్దాయి చిత్తూరు నగరంలోని మిట్టూరుకు చెందిన విజయ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అతనితో పాటు అతని సమీప బంధువులు జననపల్లెకు చెందిన కిరణ్ కుమార్, మహేష్ కుమార్ పై కేసు నమోదు చేశారు. విజయ్ కుమార్ 2013 బ్యాచ్ కు చెందిన పోలీసు కానిస్టేబుల్‌గా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో కాణిపాకం పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే విజయ కుమార్, డిప్యుటేషన్ పై ప్రస్తుతం రేణిగుంట పొలీసు స్టేషన్ లో పని చేస్తున్నారు. అయితే సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఖాకీ చోక్కా మాటున గంజాయి అక్రమ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పైఅధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి..
తిరుపతి నుంచి చిత్తూరు జిల్లాల్లోని , తవణంపల్లె, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, కాణిపాకం, పలమనేరు వంటి ప్రాంతాలకు కానిస్టేబుల్ విజయకుమార్ తన సమీప బంధువులైన మహేష్, కిరణ్ సహాయంతో గంజాయిని తరలించేవాడు. గతంలో తాను చిత్తూరు జిల్లాలో పని చేసిన పోలిసుల పరిచయాలతో గంజాయిని తరలించేవాడు. అయితే తనకు సహకరించిన వారికి కొంత నగదు, బహుమతులు ఇచ్చేవాడు. బెంగళూరు, తమిళనాడు నుంచి గంజాయిని తెప్పించుకుని తిరుపతి, చిత్తూరు జిల్లాలో విక్రయించేవాడని పోలీసులు గుర్తించారు. అయితే గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసే గంజాయి అక్తమ రవాణా చేస్తుండడంపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.