సిగరెట్ రేపిన చిచ్చు- తిరుపతిలో నిండు ప్రాణం బలి !
Tirupati Crime News: మద్యం మత్తులో ఉన్న ఓ భక్తుడిని తాను తాగే సిగరేట్ ఇవ్వమన్నాడే కోపంతో.. మరో భక్తుడిపై దాడి చేశాడు. నన్నే దాడి చేస్తావా అంటూ అతడిని రాయితో కొట్టి చంపేశాడు మరో వ్యక్తి.
Tirupati Crime News: క్షణికావేశంతో నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న సమస్యల కారణంగానే ఒకరి ప్రాణాలను మరొకరు తీసుకుంటున్న పరిస్థితి. ఆవేశంలో ఏం చేస్తున్నామో అనే విచక్షణ కోల్పోయి ఎదుటి వ్యక్తిపై దాడులు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. స్నేహితులైనా పొరుగింటి వారితోనైనా కయ్యానికి దిగితే కర్కశంగా వ్యవహరించి ఆయువును గాలిలో కలిపేస్తున్నారు కొందరు. తాజాగా శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చిన తమిళ భక్తుల మధ్య సిగరేట్ చిచ్చు రేపింది. సమస్య చిన్నదే అయినప్పటికీ క్షణికావేశంతో చేసిన దాడిలో భక్తుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన అలిపిరి పాత చెక్ పాయింట్ లో చోటు చేసుకుంది.
దర్శనార్థం వచ్చి ఫుల్లుగా మద్యం సేవించి..
తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చేందిన మారి సెల్వం, అతని భార్య సరస్వతి మరికొంత మంది స్నేహితులు.. మొత్తం పది మంది కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్ధం మంగళవారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. అయితే శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లకుండా తిరుపతిలోనే కాలక్షేపం చేశారు. చీకటి పడడంతో బస చేసేందుకు అలిపిరి పాత చెక్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. తమతో పాటుగా వచ్చిన వారికి అక్కడే ఉండమని చెప్పిన విఘ్నేష్, మారి సెల్వం ఫుల్లుగా మద్యం సేవించారు. ఆ తర్వాత తిరిగి పాత చెక్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న మారి సెల్వం సిగరేట్ కొనుగోలు చేసేందుకు బస్టాండ్ బయట ఉన్న దుకాణం వద్దకు వచ్చాడు.
నీవు కాల్చేదే ఇవ్వమంటూ కుమార్ గొడవ..
మద్యం మత్తులో ఉన్న విఘ్నేష్ ను అక్కడే ఉన్న మరో తమిళ వ్యక్తి సిగరెట్ కావాలని అడాగడు. విఘ్నేష్ లేదని చెప్పినా వినకుండా నీవు తాగేది ఇవ్వమన్నాడు. దీంతో అంబూరుకు చెందిన కుమార్ తో, విఘ్నేష్ కు గొడవ ప్రారంభం అయింది. చాలా సేపు విరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన విఘ్నేష్ మద్యం మత్తులోనే కుమార్ పై దాడికి దిగాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా చితక బాదాడు. అనంతరం విఘ్నేష్ అక్కడి నుంచి బస్టాండు వద్దకు ప్రయాణం అయ్యాడు. తీవ్ర గాయాల పాలైన కుమార్ రాయిని చేత పట్టుకుని వెనుక వైపు నుంచి వచ్చి విఘ్నేష్ తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్త స్రావంతో సంఘటన స్ధలంలోనే విఘ్నేష్ కుప్ప కూలాడు.
కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
పక్కనే ఉన్న భక్తులు కుమార్ ను పట్టుకునే ప్రయత్నం చేయగా.. పారిపోయేందుకు యత్నించాడు. స్థానికులు అడిగిన ప్రశ్నలకు కుమార్ సరైన సమాధానం చెప్పకపోవడంతో భక్తులు బ్లూ కోర్టు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు అలిపిరి పోలీసులకు సమాచారం అందించి... విఘ్నేష్ ను 108 సహాయంతో రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే విఘ్నేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.