(Source: ECI/ABP News/ABP Majha)
Kiran Royal Arrest : తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్టు, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?
Kiran Royal Arrest : తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ నగరి పోలీసులు అరెస్టు చేశారు. తిరుచానూరు పోలీసులు అంటూ ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్లారని కిరణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Kiran Royal Arrest : తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుచానూరు పోలీసులు అంటూ వచ్చి ఇంట్లో ఉన్న కిరణ్ రాయల్ ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని కిరణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కిరణ్ రాయల్ అరెస్టుపై తిరుచానూరు పోలీసులను జనసేన నేతలు సంప్రదించారు. తాము తీసుకొని రాలేదంటూ తిరుచానూరు పోలీసులు స్పష్టం చేశారు. కిరణ్ కుటుంబ సభ్యులు, జనసేన నేతలు తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి రోజాపై కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు చేశామని నగరి పోలీసులు తెలిపారు. కిరణ్ రాయల్ ను వెంటనే విడుదల చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మోదీ- పవన్ భేటీ సమయంలో
ప్రధాని మోదీతో పవన్ భేటీ సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్ట్ చేయడాన్ని జనసేన నేతలు తప్పుబడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కిరణ్ ను అరెస్టు చేశారని ఆరోపించారు. కిరణ్ రాయల్ తిరుపతిలో జనసేన పార్టీకి ముఖ్యనేతగా ఉన్నారనే ఆయనను టార్గెట్ చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలే ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని అందుకు కిరణ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి.
మంత్రులపై కిరణ్ రాయల్ వ్యాఖ్యలు
మంత్రి రోజా విశాఖ ఎయిర్ పోర్టులో జబర్దస్త్ షో చేశారని, వైసీపీ ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గతంలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను టచ్ చేసే దమ్ము, ధైర్యం వైసీపీకి లేదన్నారు. దమ్ముంటే పవన్ ని టచ్ చేయండని ఆయన సవాల్ విసిరారు. వైసీపీ నేతలే విశాఖ గర్జన పేరుతో సభ పెట్టారని, విశాఖలో పవన్ జనవాణి కార్యక్రమం మూడు నెలల ముందే ఖరారైందన్నారు. పనికిరాని మంత్రులు పవన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులోకి పవన్ వచ్చే సమయానికే మంత్రులు అక్కడికి వచ్చారని, వైసీపీ ఏర్పాటు చేసిన రౌడీలే గంజాయి, మద్యం సేవించి మంత్రులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
దమ్ముంటే టచ్ చేయండి
దమ్ముంటే పవన్ ని టచ్ చేయాలని కిరణ్ రాయల్ అప్పట్లో సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీ వాళ్లని తరిమి కొడతారని, రోజా తమిళనాడులో పెళ్లి చేసుకున్నారని, అక్కడ రాజధాని పెట్టుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి రోజాకి విశాఖలో ఏమి జరిగిందో తెలిసింది కదా, ఇంకోసారి పవన్ పై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. పవన్ పై, జనసేన నాయకులపై అక్రమ కేసులు, అసత్య ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతాం ఎక్కువ చేస్తే బయట తిరగనీయమని రోజాకు హెచ్చరిస్తున్నామన్నారు. మంత్రి జోగి రమేష్ కి పవన్ ని చూస్తే ప్యాంట్లు తడిసి పోతున్నాయి అంటారని, మంత్రులు బాగా యాక్టింగ్ లు చేస్తున్నారని, రోజా ఎయిర్ పోర్టులో జబర్దస్త్ షో చేశారని గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు వ్యవస్థ అడ్డుకున్నది కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని అన్నారు.
అక్రమ కేసులు
జగన్ కి పవన్ అంటే భయం, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిని అడ్డుకోవాలని చూశారని కిరణ్ రాయల్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తే దాన్ని అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేసిందన్నారు. మంత్రులకు వాళ్ల శాఖపై అవగాహన లేదని, పవన్ పై విమర్శలు చేయడం, జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టించడం రోజాకు బాగా తెలుసన్నారు. వైజాగ్ లో పవన్ కి ఉన్న ఆదరణ చూడలేక, కడుపు మంటను ఇలా పోలీసులతో అక్రమ అరెస్ట్ లు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. కిమ్ లా జగన్ పరిపాలిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థలో వైసీపీకి తోత్తుల్ల ఉన్న వారిని గుర్తు పెట్టుకుంటామన్నారు. అధికారంలోకి వస్తూనే వారి పని పడతామన్నారు. ఏపీలో గంజాయి, రెడ్ శాండిల్ ఎలా అక్రమ రవాణా జరుగుతోందో కేంద్రమే చెప్పిందన్నారు.