Telugu Doctor: అమెరికాలో దుండగుల కాల్పుల్లో తెలుగు వైద్యుడు దుర్మరణం - అగ్రరాజ్యంలో సేవలతో తనదైన ముద్ర
Tirupati News: అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఓ తెలుగు వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎలా జరిగిందో తెలియలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. అక్కడి అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Telugu Doctor Died In US: అమెరికాలో ఓ తెలుగు వైద్యుడు దుండగుల కాల్పులకు బలయ్యారు. శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి (Tirupati) జిల్లా నాయుడుపేట (Naidupeta) మండలం మేనకూరుకు చెందిన పేరెంశెట్టి రమేశ్‌బాబు అక్కడ దుండగుల కాల్పుల్లో స్పాట్‌లోనే మృతి చెందారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో తెలియలేదని ఆయన స్నేహితులు తెలిపారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైద్యుడు రమేశ్‌బాబు అమెరికాలో పలు చోట్ల ఆస్పత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించడమే కాక పలు రకాలుగా సేవలందించారు.
వీధికి ఆయన పేరు
టస్కలూసా ప్రాంతంలో ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకున్న రమేశ్‌బాబు సేవలకు గుర్తింపుగా అక్కడి వీధికి ఆయన పేరు కూడా పెట్టారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు ఆయన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. రమేశ్‌బాబు తిరుపతి ఎస్వీ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. జమైకాలో ఎమ్మెస్ పూర్తి చేసిన అనంతరం అమెరికాలోనే స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా డాక్టరే. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం మొత్తం అగ్రరాజ్యంలోనే స్థిరపడ్డారు. కరోనా సమయంలో రమేశ్‌బాబు విశేష సేవలందించి పలు పురస్కారాలను సైతం అందుకున్నారు.
రమేశ్‌బాబు తాను చదువుకున్న ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షల విరాళం అందించారు. అలాగే, స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు ఇచ్చారు. ఈ నెల 15న నాయుడుపేటలోని బంధువుల వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన మరణించారన్న వార్తతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన తల్లి, తమ్ముడు తిరుపతిలో, సోదరి నాయుడుపేటలో నివాసం ఉంటున్నారు. వీరంతా అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైద్యురాలిపై దాడి
మరోవైపు, తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో శనివారం ఓ రోగి వైద్యురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో వైద్యులు ధర్నాకు దిగారు. వైద్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసగా మారిన బంగార్రాజు అనే వ్యక్తి తిరుమలలో మద్యం దొరక్క స్పృహ కోల్పోయాడు. అతన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతన్ని శనివారం ఉదయం స్విమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొద్దిసేపటి తర్వాత మెళకువలోకి వచ్చిన బంగార్రాజు వింతగా ప్రవర్తించాడు. మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిలా తనకు చికిత్స అందిస్తోన్న వైద్యురాలిపై దాడికి పాల్పడ్డాడు. వార్డులో అందరి ముందూ ఆమెపై చేయి చేసుకున్నాడు.
దీన్ని గమనించిన రోగుల బంధువులు, ఇతర వైద్యులు అతన్ని అడ్డుకున్నారు. వైద్యురాలిపై దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో స్విమ్స్‌లో వైద్యులు ధర్నాకు దిగారు. తమకు భద్రత లేదంటూ నిరసన తెలిపారు. టీటీడీ ఈవో వచ్చి తమకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వైద్యులకు నచ్చచెప్పేందుకు యత్నించినా వారు వినలేదు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన డీఎస్పీ వెంకటరమణ స్విమ్స్‌లో భద్రత పెంచుతామన్నారు. బంగార్రాజును అదుపులోకి తీసుకున్నామని.. కోలుకున్న అనంతరం విచారణ చేపడతామని వెల్లడించారు.