Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!
Cyber Crime : కమీషన్ కోసం ఆశపడితే ఉన్నది మొత్తం ఊడ్చేశాడో సైబర్ కేటుగాడు. వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయమైన సైబర్ కేటుగాడు తిరుపతికి చెందిన వ్యక్తి నుంచి రూ.2.63 లక్షలు కొట్టేశాడు.
Cyber Crime : తిరుపతికి చెందిన శేఖర్ అనే వ్యక్తికి వాట్సాప్ లో ఒక కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో నేను ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను.. మీకు గూగుల్ పే ఉందా.. నేను పెట్టిన మెసేజ్ కి మీరు రేటింగ్ ఇచ్చి దానిని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మీకు కమిషన్ రూపంలో నగదు మీ అకౌంట్ కు వస్తుందని నమ్మబలికారు. వెంటనే సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా వారు పంపిన మెసేజ్ కి రేటింగ్ ఇచ్చి దానిని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేశాడు శేఖర్. వెంటనే తనకి అతడికి 150 రూపాయలు కమీషన్ పంపించాడు సైబర్ కేటుగాడు. తరువాత ప్రీపెయిడ్ ట్యాగ్ చేస్తే మీకు కమీషన్ ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పగా తాను నమ్మి అతను చెప్పినట్లు 2000 రూపాయలు పంపించగా తిరిగి సైబర్ నేరగాళ్లు 2,800 పంపి అతనిని నమ్మించారు. ఇలా పూర్తిగా ముగ్గులోకి దింపిన సైబర్ నేరగాళ్లు.. శేఖర్ వద్ద నుంచి 30,000/ 63,900/ 80,000/ 90,000/ ఇలా కొద్ది కొద్దిగా మొత్తం 2,63,900 రూపాయలు కొట్టేశారు. కొంత నగదు వరకు కమీషన్ పంపిన నేరగాళ్లు ఆ తర్వాత అధిక మొత్తంలో నగదు వసూలు చేసి కమిషన్ పంపలేదు. కమీషన్ పంపలేదని బాధితుడు వారిని అడగగా ఇంకా 1,50,000 వేల రూపాయలు పంపిస్తే మీకు మొత్తంగా నాలుగు లక్షల 50 వేల రూపాయలు పంపిస్తామని నమ్మబలికారు. వెంటనే తేరుకున్న బాధితుడు తిరుపతి సైబర్ పోలీసులను ఆశ్రమించాడు. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించిన సైబర్ల పోలీసులకు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
ముగ్గులోకి దింపింది తమిళనాడు వాసే
తమిళనాడు మధురై జిల్లాకు చెందిన వ్యక్తి సైబర్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితిడు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఇప్పటికే 12 సార్లు ఫ్రీజ్ చేశారు బ్యాంక్ సిబ్బంది. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సీఐ రవీంద్ర నాథ్ ప్రత్యేక సైబర్ పోలీస్ బృందం తమిళనాడు మధురై వెళ్లి గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో ముద్దాయిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కి తరలించారు. బాధితుడు పోగొట్టుకున్న 2,63,900 నగదు మొత్తాన్ని తిరిగి రిఫండ్ చేసే విధంగా సైబర్ ల్యాబ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎన్నో రకాలుగా సైబర్ నేరాల పట్ల తిరుపతి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు కానీ ఏదో ఒక రకంగా ప్రజలు మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా పరిచయమై పలు రకాలుగా నేరాలు చేసేవారు, ఇప్పుడు వాట్సాప్ లో కూడా చాటింగ్ రూపంలో మెసేజ్ లు పంపి ఏదో ఒకరకంగా మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఏది కష్టపడకుండా సులభంగా రాదు, నీకు తెలియని వ్యక్తి వంద రూపాయలు ఉచితంగా ఇస్తాడంటే అందులో కచ్చితంగా మోసం దాగి ఉందని గ్రహించాలని పోలీసులు అంటున్నారు. ఇలా వంద రూపాయలు చెల్లించి లక్షల్లో డబ్బులు కాజేస్తారని, ఇది గమనించి జాగ్రత్త వహించాలని అలాగే సైబర్ మోసానికి బాధితులైన వారు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.