Tirupati Crime: 20 మంది తమిళ స్మగ్లర్ల అరెస్టు - ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్
Red sandalwood smugglers in Tirupati District: టాస్క్ ఫోర్స్ పోలీసులు 20మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 19 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Red sandalwood smugglers in Tirupati District: రాజంపేట, తిరుపతి జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో ఎర్రచందనం ముఠా ఆటకట్టించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, 20మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం కూలీల వద్ద నుంచి ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్సు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... తమ హెచ్ఓడీ, కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్ఐ కె. సురేష్ కుమార్ రెడ్డికి చెందిన మూడు ఆర్ఎస్ఐలు సురేష్ బాబు, వై.విశ్వనాథ్, కేఎస్కే. లింగాధర్ టీమ్ లు తిరుపతి టాస్క్ ఫోర్స్ ఆఫీసు నుంచి వెళ్లి 3 ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టామని చెప్పారు.
ఒక టీమ్ అన్నమయ్య జిల్లా తుమ్మలబైలు సెక్షన్ చాకిరేవు కోసం సమీపంలో అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. మరో టీమ్ అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజ్ ఫింఛా సెక్షన్ దిన్నెల ఫారెస్టు బీటు, చిట్టికురవ రాస్తా కోన సమీపంలోని నిషేధిత అటవీ ప్రాంతానికి వెళ్లారన్నారు. ఇంకొక టీమ్ తిరుపతి జిల్లా నాగపట్ల సెక్షన్లోని తిరుపతి పీలేరు రోడ్డులో గల వెంకట పద్మావతీ ఇనిస్టిట్యూట్ కళాశాల ఎదరుగా ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారని తెలిపారు. ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారని, వారిని మూడు వైపుల నుంచి టాస్క్ ఫోర్సు టీమ్ లు చుట్టుముట్టి అరెస్టు చేశామన్నారు.
వీరు మొత్తం 20మంది ఉండగా, వారిలో తమిళనాడు వేలూరు జిల్లా ఆనైకట్టు తాలూకాకు చెందిన రమేష్ (42), సురేష్ సాంబశివం (38), నవీన్ వెంకటేశన్ (23), సెంగోదరన్ మునిస్వామి (29), తిరువన్నామలై జమునామత్తూరుకు చెందిన కొళందై చిన్నపయ్యన్ (50), కల్లకురిచ్చి జిల్లాకు చెందిన ఏలుమలై (33), సామికన్ను పచ్చయ్యన్ (37), గణేశన్ పిచ్చన్ (28), అనంతరామన్ (19), అన్బు పచ్చన్ (40), అళగేషన్ కుమారస్వామి (36), సెంథిల్ రామన్ (30), తిరుపత్తూరు జిల్లాకు చెందిన వెంకటేశన్ కాళి (34), రంగనాథన్ పెరుమాళ్ (39), అదే జిల్లా ఆంబూరు తాలూకాకు చెందిన మురళి మురుగన్ (24), ఎల్లియన్ (57), వేలు రత్నం (36), ముత్తురామన్ చిన్నపయ్యన్ (40), దామోదరం రాజా (46), సత్యవేలు రత్నం (27) లుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. మరికొంతమంది ఎర్ర స్మగ్లర్లు అడవుల్లో ఉన్నారని సమాచారం ఉండడంతో, మరికొన్ని బలగాలు అడవిలో కూంబింగ్ చేపడుతున్నాయని తెలిపారు. ఎర్రచందనం దుంగల విలువ రూ.50లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు..
కడప సబ్ కంట్రోల్ పరిదిలో మరో 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆర్ఐ చిరంజీవులుకు చెందిన రెండు టీమ్ లు శుక్రవారం నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. ఆర్ఎస్ఐ నరేష్ కు చెందిన టీమ్ గోపవరం పిపికుంట రిజర్వు ఫారెస్టులో కూంబింగ్ నిర్వహిస్తుండగా, బ్రాహ్మణపల్లి వద్ద ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతున్న వ్యక్తులను గమనించి వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేయగా, వారిని కడప జిల్ల గోవపరం మండలం పీపీకుంటకు చెందిన శివ (40), ఓబులేసు (60), చెన్నయ్య(55)లుగా గుర్తించి వారి నుంచి 19ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
మరో ఆర్ఎస్ఐ రాఘవేంద్ర టీమ్ చింతలకుంట ఫారెస్టు బీటులోని బీడిబావి సెక్షన్ లో కూంబింగ్ చేస్తుండగా, కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని చుట్టుముట్టగా వారిలో నలుగురిని పట్టుకున్నారు. వారిని అన్నమయ్య జిల్లా నందలూరు మండలానికి చెందిన కనకదుర్గయ్య (51), నరసింహులు (43) రాజంపేట మండలం పి. వెంకటేశు (35), కోడూరు మండలం పరుశురాం (35)లుగా గుర్తించారు. వీరి నుంచి 13ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కూడా రూ.30లక్షల వరకు ఉండవచ్చునని డీఎస్పీ తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

