Crime News: బావిలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి- అన్నమయ్య జిల్లాలో ఘటన
Annamayya Road Accident News | అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బావిలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు చనిపోగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

Andhra Pradesh News | పీలేరు: అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు మండలంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన కారును, చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముగ్గురు మృతి, ఇద్దరు సేఫ్
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం బాలం వారి పల్లి గ్రామం కురవపల్లి దగ్గర ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో 5 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు, మరో ముగ్గురు నీళ్లలో మునిగిపోయి మృతి చెందారు

కర్ణాటక రాష్ట్రం చింతామణి తాండుపల్లికి చెందిన సునీల్, తిప్పారెడ్డి, లోకేష్, గంగులయ్య, శివన్న ఐదుగురు బృందం వీరు చింతామణి నుండి పీలేరుకు వంట పనికి కారులో వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కారు బావిలో పడటంతో లోకేష్, గంగులయ్య, శివన్న నీళ్లలో మునిగిపోయి మృతిచెందారు. తిప్పారెడ్డి, సునీల్ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలుస్తోంది.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ క్రేన్ సహాయంతో బావిలో పడిన కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. కారు బావిలో పడిపోయిన విషయం తెలియగానే గ్రామస్తులు, స్థానికులు ప్రమాదం జరిగిన కురవపల్లి బావి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొందరు స్థానికులు సహాయక చర్యలలో భాగంగా బావిలోకి దిగి పోలీసులకు సాయం చేశారు.






















