Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేసు - వెలుగులోకి సంచనల విషయాలు, నటి హేమకు డ్రగ్ టెస్టులో పాజిటివ్?
Hyderabad News: బెంగుళూరు రేవ్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 109 మందికి బ్లడ్ టెస్ట్ చేయగా అందులో 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Telugu Actress Tested Drug Positive in Bengaluru Rave Party Case: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 109 మంది శాంపిల్స్ సేకరించి బ్లడ్ టెస్ట్ చేస్తే డ్రగ్స్ టెస్టులో 87 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో తెలుగు నటి హేమ, వాసు, అరుణ్, మరో నటి ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి హేమతో పాటు ఐదుగురు వెళ్లారు. నటి హేమ బెంగుళూరు పోలీసులకు తన పేరు కృష్ణవేణిగా చెప్పారని తెలుస్తోంది. ఆమె సొంత పేరు కృష్ణవేణి కాగా.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమగా పేరు మార్చుకున్నట్లు సమాచారం. రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 150 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అందులో 27 మంది మహిళలు ఉన్నారు. 109 మంది రక్త నమూనాలు సేకరించి డ్రగ్ టెస్టుకు పంపగా.. 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వారికి నోటీసులు?
కాగా, డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చట్టం గుర్తిస్తుంది. కాబట్టి వారిని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలిస్తారు. కేసులు ఉండవు. డ్రగ్స్ సరఫరా చేసిన వారిని మాత్రమే అరెస్టు చేసి రిమాండుకు పంపుతారు. డ్రగ్స్ తీసుకున్న సెలబ్రిటీలతో పాటు ఇతరులను కౌన్సిలింగ్ చేసి , పునరావాస కేంద్రానికి తరలిస్తామని బెంగుళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికీ పోలీసులు నోటీసులు పంపనున్నారు. అనంతరం వీరిని పిలిపించి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు.? అనే దానిపై ప్రశ్నించనున్నారు.
ఇదీ జరిగింది
ఈ నెల 19న రాత్రి బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్ ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో వాసు అనే వ్యక్తి పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లుగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు చెబుతున్నారు. డీజేలతో సౌండ్ చేయడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీ అని గుర్తించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా లభ్యమయ్యాయి. ఈ పార్టీలో తెలుగు రాష్టాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. టీవీ నటులు సహా, మోడల్స్, పలువురు వ్యాపార, రాజకీయ వారసులు కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.
ప్రచారం ఖండిస్తూ నటి హేమ వీడియోలు
బెంగుళూరులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పట్టుబడినట్లు తొలుత కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన హేమ.. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. తనను ఏ రేవ్ పార్టీలోనూ పట్టుకోలేదని.. ఆ వీడియోలో చెప్పారు. అనంతరం, ఆమె వీడియో విడుదల చేసిన సాయంత్రమే హేమ తమ అదుపులోనే ఉంది అంటూ బెంగుళూరు పోలీసులు ఓ ఫోటో విడుదల చేశారు. ఆ తర్వాతి రోజు కూడా హేమ బిర్యానీ వండుతూ మరో వీడియో రిలీజ్ చేశారు. రెండు రోజుల్లో అన్నీ చెబుతా అంటూ స్పష్టం చేశారు. అయితే, తాజాగా, పోలీసులు మాత్రం హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.