Swamiji Murder Case: నమ్మకంతో ఆశ్రయం ఇస్తే ఆశ్రమంలోనే స్వామీజీ హత్య - కరీంనగర్ జిల్లాలో కలకలం
Swamiji Murder Case: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్యపల్లె హనుమాన్ ఆలయం ఆశ్రమానికి చెందిన నిర్వాహకుడు చిలుపూరి పెద్దన్న స్వామి(60) హత్యకు గురయ్యారు.
Swamiji Murder Case: నమ్మకంతో ఆశ్రయం ఇస్తే స్వామీజీనే హత్య చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్యపల్లె హనుమాన్ ఆలయం ఆశ్రమానికి చెందిన నిర్వాహకుడు చిలుపూరి పెద్దన్న స్వామి(60) హత్యకు గురయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామీజీ ఎన్నో సంవత్సరాల క్రితం హనుమాన్ దేవాలయాన్ని నిర్మించారు. అందులోనే ఆశ్రమం ఏర్పాటు చేసి అందులోనే నివసిస్తున్నారు.
స్వామీజీ చెప్పే విషయాలు జరుగుతాయని.. నిత్యం భక్తులు ఆయనను కలిసి తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్ధిక సమస్యలు చెప్పి పరిష్కరించుకుంటారని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి పది రోజుల క్రితం తమ ఇంటికి సంబంధించిన సమస్య ఉందని స్వామీజీని ఆశ్రయించాడు. శివ మాటలు నమ్మిన స్వామీజీ అతడి సమస్యను విన్నారు. అక్కడకు వచ్చి స్వయంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్దన్న స్వామిని కోరారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం వరంగల్ జిల్లాకు స్వామి వెళ్లి వచ్చారని సమాచారం.
మూడు రోజుల క్రితం శివ తన స్నేహితుడు నీలం శ్రీనివాసుని వెంట తీసుకొని ఆశ్రమానికి వచ్చి కరీంనగర్ లోనే కాస్త పని ఉందని చెప్పాడు. పట్టణంలో ఎవరూ పరిచయస్తులు లేకపోవడంతో ఒక్కరోజు కోసం ఆశ్రమంలో తల దాచుకుంటామని స్వామిని సంప్రదించారు. వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు సమస్యకు సంబంధించిన విషయాలపై చర్చించారు. స్వామి అతని డ్రైవర్ సతీష్ తో కలిసి ఆదివారం ఉదయం బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. వరంగల్ నుండి వచ్చిన ఆ ఇద్దరిని ఇంకా వెళ్లలేదని ప్రశ్నించారు. సమయం మించిపోయింది కనుక ప్రస్తుతానికి ఆశ్రమంలోనే ఉండి ఉదయం వెళ్తామని వారు స్వామీజీకి సమాధానం చెప్పారు.
సోమవారం ఉదయం స్వామికి వరుసకు అల్లుడు అయిన సతీష్ ఆలయం శుభ్రం చేయడానికి వెళ్లి స్వామి గది వద్దకు వెళ్లి పిలవడంతో ఆయన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్ స్వామిజీ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు వచ్చే చూసే సరికి స్వామి అప్పటికే చనిపోయి ఉన్నారు. రాత్రి స్వామి ఆశ్రమంలో పడుకున్న గదిలోకి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి గొంతుకు తాడు బిగించి ఆయనను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, మృతుని కుమారుడు చిలుపూరి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఘటనా స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి కర్ణాకర్ రావు, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ ప్రమోద్ రెడ్డిలు పరిశీలించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.