Vizag Crime News: విశాఖ గీతం మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
Visakhapatnam Crime News | విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థి బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

Visakhapatnam News | విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ గీతం మెడికల్ కాలేజ్‌లో దారుణం చోటు చేసుకుంది. విస్మాద్ అనే 20 ఏళ్ల విద్యార్థి కాలేజ్ బిల్డింగ్ ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో కాలేజ్ క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సంఘటన వివరాలు
విస్మాద్, హిమాచల్ ప్రదేశ్ నుండి చదువుకునేందుకు విశాఖపట్నానికి వచ్చిన విద్యార్థి. అతడు ఇటీవల గీతం మెడికల్ కాలేజ్‌లో చేరాడు. ఈ క్రమంలో విద్యార్థి విస్మాద్ కాలేజ్ బిల్డింగ్ ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో కాలేజ్ సిబ్బంది, తోటి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే, కాలేజ్ అధికారుల సమాచారంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విస్మాద్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
విద్యార్థి కుటుంబసభ్యులకు విస్మాత్ ఆత్మహత్య ఘటనపై సమాచారం ఇచ్చారు. వారు హిమాచల్ ప్రదేశ్ నుంచి విశాఖకు వస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విస్మాత్ ఆత్మహత్యతో గీతం మెడికల్ కాలేజీ క్యాంపస్ లో దిగ్భ్రాంతికర వాతావరణం కనిపిస్తోంది. అయితే మానసిక ఒత్తిడి కారణమా, లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టారు.
రైలు ఎక్కుతూ జారిపడిన విద్యార్థి మృతి
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకట నగర గ్రామానికి చెందిన హేమంత్ రాజ్ అనే యువ విద్యార్థి, ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. మంగళవారం నాడు కాలేజీకి వెళ్ళేందుకు తుని రైల్వే స్టేషన్ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ రైలు నుండి పడ్డాడు. ఈ ప్రమాదంలో హేమంత్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు కాళ్లు నుజ్జునుజ్జు కావడంతో రక్తస్రావమైంది. గాయపడిన విద్యార్థిని వెంటనే తుని రైల్వే పోలీసులు విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. చేతికి అంది వస్తాడనుకున్న కుమారుడు హేమంత్ రాజ్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.






















