Gujarat Drugs Case: గుజరాత్‌లో రూ.480 కోట్ల డ్రగ్స్ పట్టివేత- పాక్‌కు చెందిన ఆరుగురు అరెస్టు
Gujarat Porubandar coast: దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. 480 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్‌సీబీ అధికారులు... ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేశారు.
Drugs in Porubandar: ఒకటి కాదు... రెండు కాదు.. 80 కేజీల డ్రగ్స్. సముద్ర మార్గం గుండా భారత్‌లోకి తరలించే ప్రయత్నం చేశారు. కానీ.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు వారి ఆట కట్టించారు. గుజరాత్‌లో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ తీరంలో 480 కోట్ల రూపాయలు విలువ చేసే మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో.... ఈ డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టు రట్టు అయ్యింది. 80 కేజీల డ్రగ్స్‌తో వెళ్తున్న పడవను సీజ్ చేశామని, అందులో ఉన్న ఆరుగురు పాకిస్థాన్ సిబ్బందిని పట్టుకున్నామని అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో డ్రగ్స్..
మార్చి 11, మార్చి 12న నిర్వహించిన జాయింట్ ఓవర్‌నైట్ ఆపరేషన్‌లో... పోర్‌బందర్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని అరేబియా సముద్రంలో.. ఐసీజీ (ICG) నౌకలు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సమన్వయంతో పడవను పట్టుకున్నారు భారత్ కోస్ట్ గార్డ్ సిబ్బంది. పడవలోని ఆరుగురు పాకిస్తానీయులను పోర్‌బందర్‌కు తరలించారు. మూడేళ్లలో కోస్ట్ గార్డ్, ఏటీఎస్, ఎన్‌సీబీలు కలిసి ఇప్పటివరకు 3వేల 135 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. డ్రగ్ సరఫరాకు వీరు వినియోగించిన నౌక భారత్‌కు చెందినదిగా గుర్తించారు. పక్కా సమాచారంతో... ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), మరియు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని పోలీసు సూపరింటెండెంట్ సునీల్ జోషి తెలిపారు.
ఢిల్లీ, పంజాబ్‌కు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసేందుకు యత్నించినట్టు అధికారులు గుర్తించామన్నారు. నెల రోజుల్లోనే గుజరాత్ తీరంలో ఈ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 26న పోర్‌బందర్ తీరంలో 3వేల 300 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడమే కాదు.. ఆనాడు ఐదుగురు విదేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో వెరావల్ పోర్టులో 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం రావడంతో... నిన్న (మార్చి 11న) అరేబియా సముద్రంలో నిఘా పెట్టంది ఇండియన్ కోస్ట్ గార్డ్. డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో స్కాన్ చేసింది. పూర్తిగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత... ఎన్‌సీబీ, ఎటీఎస్ గుజరాత్ బృందాలతో ICG షిప్‌లు అక్కడికి చేరుకున్నాయి. అనుమానాస్పదంగా కదులుతున్న పడవను గుర్తించాయని ఆపరేషన్‌లో పాల్గొన్న కోస్ట్ గార్డ్ తెలిపారు. కోస్ట్ గార్డ్ షిప్‌లను చూసి... పడవలో ఉన్న డ్రగ్స్ స్మగ్లర్లు తప్పించుకునే ప్రయత్నం చేశారని... కానీ.. వారి పడవను వెంబడించి పట్టుకున్నామని చెప్పారు.