Sajjanar: 'ఆ కంపెనీని దేశం విడిచి వెళ్లాలని తీర్పు' - ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సజ్జనార్ ట్వీట్
Qnet Scam: క్యూనెట్ మోసాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ సంస్థను ఎన్‌సీఎల్‌టీ వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
RTC MD VC Sajjanar Tweet On QNet Scam: సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (VC Sajjanar) తాజాగా మరో ట్వీట్ చేశారు. మోసపూరిత క్యూనెట్ (QNet) సంస్థపై ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ - బెంగుళూరు ఇచ్చిన సంచలన తీర్పును ప్రస్తావించారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ(క్యూనెట్)ను తన వ్యాపారాన్నిభారతదేశంలో చేయొద్దని, తక్షణమే ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించిందని చెప్పారు. 'QNet' అని విస్తృతంగా పిలవబడే ఈ కంపెనీ.. మోసపూరిత స్కీమ్‌ల ద్వారా మిలియన్ల మంది ప్రజలను మోసగించినట్లు వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేలాది కేసులను ఎదుర్కొంటోందని.. ప్రతి ఒక్కరికీ ఈ మోసపూరిత స్కామ్ గురించి తెలియజేయాలని. దాని బారిన పడకుండా దూరంగా ఉండాలని సూచించారు.
మోసపూరిత క్యూనెట్ సంస్థపై ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిట్యునల్-బెంగళూరు సంచలన తీర్పును వెలువరించింది. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ(క్యూనెట్)ను తన వ్యాపారాన్నిభారతదేశంలో చేయొద్దని, తక్షణమే ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 27, 2024
"QNet" అని విస్తృతంగా పిలవబడే… https://t.co/JN2UwCPxh4
కాగా, గతంలోనూ ఈ సంస్థ మోసాలపై సజ్జనార్ అలర్ట్ చేశారు. ప్రజలు అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ తరహా గొలుసుకట్టు వ్యాపార సంస్థల వలకు చిక్కొద్దని హెచ్చరించారు. సదరు సంస్థ అమాయకుల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిందని.. పెట్టుబడిదారుల్ని మోసం చేసినందునే తాను పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో గట్టిగా పోరాడినట్లు తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆ సంస్థ ఆస్తుల్ని జప్తు చేశాయని చెప్పారు. గొలుసుకట్టు కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపారంతో దేశ ఆర్థిక పరిస్థితితో పాటు మానవ సంబంధాలు సైతం దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు. సజ్జనార్ సైబరాబాద్ సీపీగా పని చేస్తోన్న సమయంలోనే క్యూనెట్ మోసాలపై కేసులు నమోదు చేసి 60 మందిని అరెస్ట్ చేశారు. ఆ సంస్థకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన ప్రముఖ నటులకు సైతం అప్పట్లో నోటీసులు జారీ చేశారు.
న్యూ ఇయర్ విషెష్ పేరిట మోసాలు..
మరోవైపు, న్యూ ఇయర్ విషెష్ పేరిట సైతం సైబర్ నేరగాళ్లు ఖాతాలు ఖాళీ చేసే ప్రమాదం ఉందంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ చేశారు. 'న్యూ ఇయర్ విషెస్ చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు. ఏపీకే ఫైల్స్ అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడితే సమస్త సమాచారం నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి... జాగ్రత్త!!' అంటూ ట్వీట్ చేశారు.
'నూతన సంవత్సర శుభాకాంక్షల' పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్లాన్ వేశారు.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 27, 2024
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తి గత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది.
న్యూ ఇయర్ విషెస్ చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా… pic.twitter.com/NudS8MdGn8
Also Read: Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ