Kadapa RMP Crime : డాక్టర్లనే బురిడీ కొట్టించే ఆర్ఎంపీ .. మాయలో పడితే మొత్తం ఊడ్చేస్తాడు !
ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు ఇప్పిస్తానంటూ ప్రైవేటు ఆస్పత్రి ఓనర్లను మోసం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్‌ను అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు. 14 ఏళ్లుగా పలువుర్ని మోసం చేసినట్లుగా గుర్తింంచారు.
ఆన్‌లైన్ మోసాల్లో నైజీరియన్లే మొనగాళ్లనుకుంటే వాళ్ల కంటే తెలివైన వాళ్లమున్నామని ఎవరో ఒకరు నిరూపిస్తూనే ఉంటారు. జస్ట్ ఓ ఫోన్ కాల్‌లో అకౌంట్లలో డబ్బులు వేయించుకునే కేటుగాళ్లు చాలా మంది ఉన్నారు. డాక్టర్లనైనా ఇట్టే బురిడీ కొట్టించగలరు వారు ఉన్నారు. ఇలాంటి ఓ వ్యక్తిని కడప జిల్లా రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిది శ్రీకాకుళం జిల్లా. చేసేది ఆర్ఎంపీ వృత్తి. ప్రైవేటు ఆస్పత్రులకు రోగుల్ని రిఫర్ చేసి చేసి అంతకు మించి ఇంకేదైనా చేయాలనుకున్నట్లుగా ఉన్నాయి. ఆ ప్రైవేటు ఆస్పత్రుల వీక్‌నెస్ పట్టుకుని డబ్బులు గుంజడం ప్రారంభించాడు.
ఏపీలో ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన ఆస్పత్రులకు ప్రభుత్వ బిల్లులు ఎప్పుడూ పెండింగ్‌లోనే ఉంటూ ఉంటాయి. ఆస్పత్రి యాజమాన్యాలు అడగంగా.. అడగంగా ఎప్పుడో ఇస్తూ ఉంటారు. ఈ పాయింట్‌నే పట్టుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణ రావు ప్రైవేటు ఆస్పత్రుల ఫోన్ నెంబర్లు.. వాటి యజమానులైన వైద్యుల ఫోన్ నెంబర్లు సేకరించి ఒకరి తర్వాత ఒకరికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ఆస్పత్రి యజమానికి ఫోన్ చేసి మొదట వై.ఎస్.ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ అంటూ పరిచయం చేసుకుంటాడు. ట్రూ కాలర్‌లో అలాగే కనిపించేలా చూసుకున్నాడు.
ఆ తర్వాత మీ ఆసుపత్రికి సంబంధించిన పెండింగ్ బకాయిలు రిలీజ్ చేస్తానని హామీ ఇస్తాడు. అందుకు కొంత మొత్తం లో ముందుగానే తన అకౌంట్ లో డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తాడు. డబ్బులు వేయని పక్షంలో మీ పెండింగ్ బకాయిలు పూర్తీగా ఆపేస్తానని బెదిరిస్తాడు. ఇలా గత 14 సంవత్సరాలుగా ప్రైవేటు ఆసుపత్రులే లక్ష్యంగా చేసుకుని ఎవ్వరికీ దొరక్కుండా మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు. ఆస్పత్రి యాజమాన్యాలు ఎవరికీ చెప్పుకోలేక.. వదిలేస్తూ వచ్చాయి.
అయితే నారాయణరావు పాపం ఎప్పుడో ఓ సారి పండక తప్పదు. రాయచోటి అమరావతి ఆసుపత్రి ఎం.డి కొండూరు ప్రవీణ్ కుమార్ రాజుకు ఇలాగే ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. చివరికి రూ. లక్షన్నర నారాయణరావుకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కానీ తన బిల్లులు రాకపోవడంతో ఆరా తీశాడు. మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న రాయచోటి అర్బన్ సి.ఐ సుధాకర్ రెడ్డి, చాకచక్యంగా వ్యవహరించి వారం రోజుల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేసి డబ్బు రికవరీ చేశారు గత పధ్నాలుగేళ్లుగా ఇలా అనేక మందిని నారాయణరావు మోసం చేశాడని పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.