Rajasthan Road accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- 11మంది మృతి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. భరత్‌పూర్‌లోని జైపూర్-ఆగ్రా హైవేపై ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రైలర్ వాహనం బస్సును ఢీకొట్టడంతో 11 మంది మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. భరత్‌పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలోని జైపూర్-ఆగ్రా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
నబ్దాయి ప్రాంతంలోని హంటారా కల్వర్టు సమీపంలో ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ఉన్న బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న సమయంలో... హైవేపై సర్వీస్ లేన్ దగ్గర వేగంగా వచ్చిన ట్రైలర్ వాహనం ఢీకొట్టినట్టు చెప్తున్నారు. గాయపడిన వారిని భర్కత్‌పూర్ ఆర్‌బీఎంలోని ఆసుపత్రిలో చేర్చామన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో 57 మంది ఉన్నారని... వారంతా మధురలోని బృందావనాన్ని సందర్శించేందుకు గుజరాత్‌లోని భావ్‌నగర్ నుంచి వచ్చారని చెప్పారు.
లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హంటారా పులియా సమీపంలో డీజిల్ పైపు లీకేజీ కారణంగా బస్సు రిపేర్ అయ్యింది. దీంతో రోడ్డు పక్కగా బస్సు ఆపారు. ఇంతలో వెనుక నుంచి వస్తున్న ట్రైలర్ వాహనం... బస్సును ఢీకొట్టింది. ట్రైలర్ అతివేగంగా వచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 11 మంది మృతిచెందనట్టు నిర్ధారించారు. మృతదేహాలను భరత్‌పూర్‌లోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో ఉంచారు. రెండు రోజుల క్రితం కూడా భరత్‌పూర్‌లో ఇలాంటి పెను ప్రమాదం జరిగింది.
భరత్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మృదుల్ కచావా తెలిపిన వివరాల ప్రకారం... బస్సులోని ప్రయాణికులు గుజరాత్‌లోని భావ్‌నగర్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని మథురకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గుజరాత్ నుంచి మతపరమైన తీర్థయాత్రకు వచ్చిన భక్తులు ఘోర ప్రమాదానికి గురై 11 మంది మరణించడం చాలా బాధాకరమని అన్నారు సీఎం అశోక్ గెహ్లాట్. పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని... గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని చెప్పారు. మరణించిన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని.. వారికుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని అన్నారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు.