Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!
Loan Apps Cheating : లోన్ యాప్ నిర్వాహకుల ఆటకట్టించారు రాజమండ్రి పోలీసులు. దంపతులు ఆత్మహత్య కేసులో విచారణ చేపట్టి ఏడుగురిని అరెస్టు చేశారు.
Loan Apps Cheating : లోన్ యాప్ నిర్వాహకుల ఆటకట్టించారు రాజమండ్రి పోలీసులు. ఇటీవల లోన్ యాప్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో విచారణ చేపట్టి ఏడుగురిని అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన పురుగుల మందు తాగి కొల్లి దుర్గారావు, కొల్లి రమ్య లక్ష్మి అనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. కొల్లి దుర్గారావు దంపతులు తమ అవసరాలకై చిన్న మొత్తాల లోన్ తీసుకున్నారు. అయితే ఈ లోన్ ను తిరిగి ఎక్కువ మొత్తంలో తీర్చమని, లేకపోతే వారి ఫోటోలును మార్చింగ్ చేసి సోషల్ మీడియాలో, బంధువులకు పెడతామని బెదిరించడంతో దుర్గారావు దంపతులు బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతులను బెదిరింపులకు గురిచేసిన హాండీ లోన్, స్పీడ్ లోన్ అనే రెండు లోన్ యాప్ లలో పనిచేస్తున్న ఏడుగురుని అరెస్ట్ చేశామన్నారు.
ఎస్పీ ఏమన్నారంటే?
రాజమహేంద్రవరం స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రాజమండ్రి పోలీసులు దర్యాప్తు చేసి లోన్ యాప్ నిర్వాహకులను గుర్తించారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలలో దర్యాప్తు చేసి మరో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారన్నారు. నిర్వాహకులు చాకచక్యంగా మూడు దశలలో మల్టీ లెవెల్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్లను సృష్టించి నిరుద్యోగులకు డబ్బు ఎరగా వేసి వారి బ్యాంక్ అకౌంట్ ద్వారా లోన్ యాప్ బాధితులకు చిన్న మొత్తంలో లోన్ ఇచ్చి రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.
(ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి)
మూడు దశల్లో నగదు ట్రాన్స్ పర్
మొదటి దశలో సుమారు 80 నుంచి 100 సేవింగ్ ఖాతాలు సృష్టించి, ఒక్కో అకౌంట్ నుంచి ప్రతి నెల సుమారు 100 మందికి అప్పు ఇచ్చి దానికి రెండు, మూడు వంతులు అధికంగా వసూలు చేస్తున్నట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ఈ విధంగా బాధితుల నుంచి వసూలు చేసిన నగదును 2వ దశలో సుమారు 20 కంపెనీల పేర్లతో ఓపెన్ చేసిన కరెంటు అకౌంట్లకు బదిలీ చేస్తున్నారన్నారు. ఈ కరెంటు అకౌంట్ లావాదేవీలు పరిశీలించగా ఒక్కొక్క అకౌంట్లో ఒక నెలకు సుమారు రూ.15-20 కోట్ల వరకు ఈ విధంగా లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్న వారిని బెదిరించి వసూలు చేస్తున్నారని తెలిసిందన్నారు. ఈ సొమ్మును 3వ దశలో గుజరాత్ లో ఉన్న షెల్ కంపెనీల అకౌంట్లకు బదిలీ చేసి ఆ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసి హవాల మార్గంలో లోన్ యాప్ ఓనర్స్ తీసుకున్నట్లు నిర్ధారించినట్లు ఎస్పీ చెప్పారు.
తప్పించుకున్న ప్రధాన నిందితుడు
గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీ ఓనర్లలో ముగ్గుర్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు తృటిలో తప్పించుకున్నాడన్నారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని ఎస్పీ వెల్లడించారు. ఈ నిందితులను పట్టుకోవడం కోసం కె. లక్ష్మణ రెడ్డి, సీ.ఐ నల్లజర్ల బృందం గుజరాత్ రాష్ట్రానికి, ఎ. శ్రీనివాస రావు, సి.ఐ దేవరపల్లి బృందం మహారాష్ట్రకు, పి.ఈ. పవన్ కుమార్ రెడ్డి, సీ.ఐ ప్రకాష్ నగర్ బృందం కర్ణాటక రాష్ట్రాలలో పర్యటించి లోన్ యాప్ నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. అదేవిధంగా ఈ లోన్ యాప్ నిర్వాహకులకు ఎవరైనా సహకరించినట్లయితే వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి యాప్ లను నమ్మి వారి ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, గ్యాలరీ, కాల్స్, మెసేజెస్ అండ్ ఫైల్స్ యాక్సెస్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడినా, ఈ విధమైన లోన్ App ఏజెంట్లుగా పనిచేసినా, వారిపై Sec. 384, 386 IPC ప్రకారం 10 సం.లు వరకు జైలు శిక్షార్హులవుతారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.