(Source: ECI/ABP News/ABP Majha)
Current Motors Theft: కారులో తిరుగుతూ కరెంట్ మోటార్ల చోరీలు చేసే ముఠా అరెస్ట్!
Current Motors Theft: కారులో తిరుగుతూ కరెంట్ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే 101 మోటార్లను స్వాధీనం చేస్కున్నారు.
Current Motors Theft: వారంతా డ్రైవర్లు. ఫుల్లుగా తాగి మస్త్ జల్సాలు చేస్తుంటారు. కానీ వారికొచ్చే డబ్బులు జల్సాలకు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే దొంగతనాలు చేయాలని నిశ్చచింకున్నారు. అనుకున్నదే తడవుగా అంతా కలిసి కరెంటు మోటార్లు దొంగతనం చేయడం ప్రారంభించారు. చేన్లు, బావుల వద్ద ఎవరూ లేని సమయం చూసి కరెంట్ మోటార్లు చోరీలు చేస్తున్నారు. కానీ వీరికి ఎక్కువగా అనుభవం లేకపోవడంతో ఇట్టే పోలీసులకు దొరికిపోయారు. మొత్తం నిందితుల నుంచి మొత్తం 30 లక్షల రూపాయల విలువ చేసే 101 మోటార్లు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
నిందితులంతా స్నేహితులే..
ఈ నిందితులు అంతా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వారని జగిత్యాల జిల్లా డీఎస్పీ ఆర్. ప్రకాష్ తెలిపారు. నిందితులందరూ స్నేహితులని.. వారంతా డ్రైవర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే వారంతా జల్సాలకు అలవాటు పడడంతో వచ్చిన డబ్బు చాలకపోగా ఎలాగైనా అక్రమంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మెట్ పల్లిలోని రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లను అద్దెకు తీసుకొని జగిత్యాల జిల్లాలో గల పెగడపల్లి,మల్యాల, జగిత్యాల రూరల్, గొల్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో చోరీలు చేసినట్లు తెలిపారు. ఎక్కువగా సారంగాపూర్, రాయికల్, చొప్పదండి మండలం లోగల గ్రామాల్లోని వ్యవసాయ భూములలోని మోటార్లను దొంగిలించి అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.
సాధారణ తనిఖీల్లో దొరికిపోయిన దొంగలు..
వాటిలో కొన్నిటిని ఏ1 నిందితుడు అల్లేపు లక్ష్మన్ గ్రామం అయిన మెట్ పల్లిలో ఉంచి, మిగిలిన వాటిని పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామం వద్ద గల ఎస్సారెస్పీ కాలువ దగ్గర చెట్ల పొదల్లో మోటార్లను దాచి పెట్టారు. సమయాన్నిబట్టి ఎక్కడైనా మోటార్లను రిపేర్ చేసేవారికి అమ్మడానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం మెట్ పల్లి నుండి కొన్ని మోటార్లను తీస్కొని కారులో బయలు దేరారు. సరిగ్గా ఇదే సమయంలో పెగడపల్లి గ్రామంలోని నంది కమాన్ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మల్యాల ఇన్ స్పెక్టర్ రమణ మూర్తి, పెగడపల్లి ఎస్ఐ కొక్కుల శ్వేత ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో వీరి దొంగతనం బయట పడింది.
30 లక్షల రూపాయల విలువ చేసే 101 మోటార్లు..
కారులో తరలిస్తున్న మోటార్లను పట్టుకొని నిందితులను విచారించగా... విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వీరి నుండి సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే 101 కరెంట్ మోటార్లతో పాటు 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆరుగురు నిందితులను కూడా అదుపులోకి తీస్కున్నారు. అయితే నిందితులపై పెగడపల్లి పీఎస్ లో 4, రాయికల్ 5, జగిత్యాల రూరల్ 4, మల్యాల 2,చొప్పదండి 2, సారంగాపూర్ 1, గొల్లపల్లి 1, బీర్పూర్ 1... ఇలా మొత్తం 20 కేసులు నమోదు అయ్యాయి.
సాధారణ తనిఖీల ద్వారా కరెంటు మోటార్ల దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మల్యాల ఇన్స్పెక్టర్ రమణ మూర్తి, పెగడపల్లి ఎస్ఐ శ్వేత, మల్యాల ఎస్ఐ చిరంజీవి, కొడిమ్యాల ఎస్ఐ వెంకట్ రావు, పెగడపల్లి ఏఎస్ఐ సత్తయ్య, హెచ్ సీ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఉదయ్, సంపత్, వెంకటేష్, తిరుపతి, ఎల్లయ్య, సుమన్, వేణు గోపాల్, రాజేందర్, చంద్రశేఖర్, హోమ్ గార్డ్ రాజు, డ్రైవర్ రాజులను జిల్లా SP సింధు శర్మ అభినందించారు.