Palnadu News: టైర్ పంక్చర్ వేసేందుకు వాడే సొల్యూషన్ పీల్చి బాలుడి మృతి!
Palnadu News: మత్తు కోసం ఓ బాలుడు టైర్లకు పంక్చర్ వేసేందుకు వాడే సొల్యూషన్ ను పీల్చాలనుకున్నాడు. ఓ ప్లాస్టిక్ కవర్ పై సొల్యూషన్ వేసుకొని పీల్చిన కాసేపటికే అతడు మృతి చెందాడు.
Palnadu News: పల్నాడు జిల్లా పిడుగురాల్ల పట్టణంలో ఓ బాలుడి మత్తు కోసం చేసిన చిన్న ప్రయత్నం అతని ప్రాణాలను తీసింది. టైర్లకు పంక్చర్లు వేసేందుకు వాడే సొల్యూషన్ పీల్చి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీనివాస కాలనీ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే మత్తు కోసం టైర్లకు పంక్చరు వేసేటప్పుడు వాడే సొల్యూషన్ ను ప్లాస్టిక్ కవరన్ లో వేసుకొని పీల్చాడు. అలా చేసిన కాసేపటికే బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి.. బాబు మృతిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్సై కె అమీర్.. ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో చాలా మంది మత్తు కోసం సొల్యూషన్ ను పీలుస్తున్నారని ఎస్సై తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు చూడాలని.. ఎప్పటికప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచాలని వివరిస్తున్నారు.
దొంగతనం చేసేందుకు వచ్చావని అవమానించడంతో బాలిక ఆత్మహత్య..
ఏలూరు పెదవేగి మండలం రాట్నాలకుంటలో గత నెల 25వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పక్కింటి వారేనని.. దొంగతనం చేయడానికి వచ్చావంటూ వాళ్లు కొట్టడంతోనే మనస్తాపానికి గురై తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
పక్కింటి వారు కొట్టడంతోనే ఆత్మహత్య!
ఏలూరు నగరానికి చెందిన 17 ఏళ్ల కర్ణాటి కోమలేశ్వరి నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చుదువుతోంది. కోమలేశ్వరి తండ్రి గతంలోనే చనిపోయాడు.తల్లి పద్మావతే కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే గత నెల 25వ తేదీన కర్ణాటి కోమలేశ్వరి పక్కనే ఉన్న ఇంట్లోని కుక్క పిల్లలను చూసేందుకు వారి ఇంటికి వెళ్లింది. అయితే కోమలేశ్వరిని చూసిన ఆ ఇంటిలోని భార్య భర్తలు దొంగతనం చేసేందుకు వచ్చావా అంటూ కొట్టారని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. అదే రోజు కోమలేశ్వరి.. పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఉంటున్న నానమ్మ వెంకట రమణ ఇవద్దకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగింది. తర్వాత కోమలేశ్వరిని గమనించి హుటాహుటినా దగ్గరిలోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కోమలేశ్వరి పరిస్థితిని గమనించి వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించగా.. కుటుంబ సభ్యులు కోమలేశ్వరిని విజయవాడకు తరలించారు. అప్పటి నుండి కోమలేశ్వరి అక్కడే చికిత్స పొందుతోంది. అయితే పరిస్థితి విషమించడంతో ఈ నెల 8 వ తేదీన రాత్రి కోమలేశ్వరి తుది శ్వాస విడిచింది.
బిడ్డ ఆత్మహత్యపై తల్లి ఫిర్యాదు..
బిడ్డ మరణంపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుక్క పిల్లలను చూసేందుకు వెళ్తే.. దొంగతనానికి వచ్చావని కొట్టారని, అందుకే తన బిడ్డ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొంది. తల్లి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశామని.. పూర్తి స్థాయిలో, అన్ని రకాల కోణాల్లో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు మూడో పట్టణ సీఐ వరప్రసాద రావు తెలిపారు.