Kochi Blast: కేరళ పేలుడు ఘటనపై ఎన్ఎస్ జీ బృందం దర్యాప్తు - ఉగ్ర దాడి అనుమానాలపై విచారణ
Kochi Blast: కేరళలో బాంబు పేలుళ్ల ఘటనపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఎస్ జీ బృందం సిద్ధమవుతోంది.
కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం భారీ పేలుడు సంభవించిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఎస్ జీ బృందం సిద్ధమవుతోంది. ఉగ్ర దాడి అనుమానాలున్ననేపథ్యంలో ఓ అధికారితో సహా 8 మంది సభ్యుల నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందం కేరళకు వెళ్తోంది. ఆదివారం సాయంత్రానికి బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించనున్నారు.
#WATCH | Visuals from Ernakulam, Kerala where one person died, and several injured in an explosion at a Convention Centre in Kalamassery https://t.co/hir8k808v2 pic.twitter.com/305HuzA4gg
— ANI (@ANI) October 29, 2023
ఇదీ జరిగింది
కేరళలోని కొచ్చిలో కలమస్సేరి సమీపంలో ఓ కన్వెన్షన్ సెంటర్‌లో (Kochi Blast) ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇది ఉగ్ర దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఓ మతపరమైన కార్యక్రమంలో 2 వేల మందికి పైగా పాల్గొన్నారని, ప్రార్థన సమయంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇందుకు ఐఈడీ ఉపయోగించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. హుటాహుటిన అక్కడి వారిని బయటకు పంపించినట్లు చెప్పారు. అయితే, కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండడం వల్ల క్షతగాత్రుల తరలింపులో జాప్యం జరిగిందని పేర్కొన్నారు.
'3 చోట్ల పేలుళ్లు'
కన్వెన్షన్ హాలులో 3 నుంచి 4 చోట్ల పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రార్థనా సమయంలో అంతా నిమగ్నమై ఉండగా, హాలు మధ్యలో భారీ పేలుడు జరిగినట్లు చెప్పారు. అనంతరం 2, 3 చిన్నపేలుళ్లు జరిగాయని వివరించారు.
సీఎం స్పందన
ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. పేలుళ్ల ఘటన దురదృష్టకరమని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై ఆరా తీశారు. సీఎం పినరయికి ఫోన్ చేసి మాట్లాడారు.
డీజీపీ ఏమన్నారంటే.?
పేలుడు కోసం ఐఈడీ వాడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ పేలుళ్లకు ఒక్క రోజు ముందే హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ మాజీ చీఫ్ ఖలీద్ మషల్ పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఆందోళనలకు మద్దతు తెలిపాడు. వర్చువల్‌గా ఈ ఆందోళనల్లో పాల్గొన్నాడు. దీనిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. దేశంలో విద్వేషాలు పెంచడంతో పాటు అల్లర్లు సృష్టించేందుకు సోషల్ మీడియాని ఆయుధంగా మార్చుకుంటున్నారన్న వాదనలు వినిపించాయి. ఇది జరిగిన మరుసటి రోజే కేరళలో పేలుళ్లు సంభవించడం అలజడి సృష్టించింది. ఈ పేలుళ్లపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. సెలవులో ఉన్న వాళ్లు కూడా పని చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు.
Also Read: పంజాబ్‌లో దారుణం, షాప్ ఎదుట కూర్చున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు - అక్కడికక్కడే మృతి