Nizamabad Crime : పెద్ద పోచమ్మ ముక్కు పుడక చోరీ, పట్టించిన మూడో కన్ను
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పట్టపగలే గుడిలో చోరీ జరిగింది. ఓ మహిళ గుడిలో చొరబడి అమ్మవారి ముక్కు పుడక దొంగిలించింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద పోచమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. అయితే ఈ దొంగతానికి పాల్పడింది ఓ మహిళ. అమ్మవారి గుడిలో ప్రవేశించిన మహిళ ఎవరూ లేని సమయం చూసి ముక్కుపుడక చోరీ చేసింది. జిల్లా కేంద్రంలోని పెద్ద పోచమ్మ ఆలయంలో అమ్మవారి ముక్కు పుడక చోరీ స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం ఉదయం నుంచి 12 గ్రాముల అమ్మవారి ముక్కుపుడక కనిపించడంలేదని ఆలయ నిర్వాహకులు గుర్తించారు. గుడిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తే గుడిలో ఎవరు లేని సమయంలో అమ్మవారి ముక్కుపుడకను ఓ మహిళ చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలు ఆధారంగా మహిళను గుర్తించిన ఆలయ సిబ్బందిని, ఆమెను పట్టుకుని గుడిలో చెట్టుకు కట్టేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి మహిళను వారికి అప్పగించారు.
విజయవాడ దుర్గగుడిలో చోరీ
విజయవాడ దుర్గగుడిలో మరోసారి చోరీ జరిగింది. ఏకంగా సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం సంచలనంగా మారింది. హుండీ లెక్కింపులో ఇలా బంగారం దొంగిలించడం... ఆ బంగారాన్ని బాత్రూమ్‌లో దాచిపెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. విజయవాడ కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మహా మండపం బాత్రూంలో 12 తులాల బంగారాన్ని ఆలయ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీల్లో వెలుగు చూసింది. సోమవారం అమ్మవారి హుండీ లెక్కింపు జరిగింది. అంతా సజావుగాసాగిందనుకున్న టైంలో పది లక్షల విలువైన బంగారం కనిపించడం లేదని ఆలయాధికారులు గుర్తించారు. మాయమైన బంగారం ఏమై ఉంటుందని అంతా కంగారు పడ్డారు. చివరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి జరిగిన చోరీపై అంతర్గత విచారణ చేపట్టారు.
అంతర్గత విచారణలో భాగంగా అన్ని ప్రాంతాలను చెక్ చేశారు. వచ్చిన వారందరిని పిలిచి ఆరా తీశారు. చివరకు పది లక్షల విలువైన బంగారం ఆలయంలోని బాత్ రూంలో గుర్తించారు. అది చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. జరిగిన బంగారం చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. దేవస్థానం అధికారులు, మండలి సభ్యులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు.
2020 అక్టోబర్‌లో కూడా దుర్గమ్మ రథానికి ఉండే సింహాలను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇది సుమారు ఏడాది పాటు తీవ్ర సంచలనంగా మారింది. అప్పట్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సుమారు నాలుగు నెలల విచారించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. దుర్గ గుడిని సందర్శించిన సాయిబాబా అనే వ్యక్తి రాత్రివేళలో గోడ దూకి వచ్చి రథానికి ఉన్న సింహాలు ఎత్తుకెళ్లినట్టు చెప్పారు. ఇనుపరాడ్‌తో మూడు సింహాలు పెకిలించి ఎత్తుకెళ్లిపోయాడన్నారు. పదహారు కిలోల బరువు ఉన్న విగ్రహాలను తణుకులో అమ్మేశాడని తెలిపారు. అతనితోపాటు వెండిని కరిగించిన బంగారు వ్యాపారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో వెండి విషయం కూడా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది వెంటనే తెలిసినా ఇంత వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తవుతున్నాయి. తాత్సారం దేనికి చేస్తున్నారని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.