Nizamabad Man Dies: మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి - పెళ్లిలో ఘటన!
Nizamabad Man Dies: పాపం.. ఆ వ్యక్తి పెళ్లిలో తినడమే తప్పు అయింది. ఎందుకు అంటారా.. వివాహ విందులో మాంసం ముక్క గొంతులో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
Nizamabad Man Dies: పెళ్లిళ్లు, విందులు, ఇతర ఫంక్షన్లకు పిలవగానే వెళ్లిపోతుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ పెడుతున్నారంటే మరింత ఎక్కువ మంది వెళ్తుంటారు. పెళ్లిళ్లలో మాంసాహారం పెట్టలేదని తెలిస్తే చాలా మంది గొడవ కూడా చేస్తుంటారు. అయితే అలా ఓ పెళ్లిలో పెట్టిన నాన్ వెజ్ వల్లే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏంటీ మాంసాహారం వల్ల వ్యక్తి చనిపోయాడా అనిపిస్తోందా.. అవును నిజమేనండి. సదరు వ్యక్తి వివాహ విందులో భోజనం చేస్తున్నాడు. సడెన్ గా ఓ మాంసం ముక్క గొంతుల్లో ఇరుక్కుపోయింది. ఈ కారణంతో అతడు శ్వాస ఆడక అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హునుమాన్ ఫారమ్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో శనివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే నవీపేటకు చెందిన 45 ఏళ్ల రమణా గౌడ్ బంధువుల పెళ్లికి వెళ్లాడు. అందరితో కలిసి మాట్లాడాడు. వధూవరులను కూడా ఆశీర్వదించాడు. ఆపై భోజనం చేసేందుకు డైనింగ్ హాల్లోకి వెళ్లారు. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టించుకొని వచ్చి తింటున్నాడు. ఈ క్రమంలోనే ఓ మాంసం ముక్క అతడి గొంతుకు అడ్డుపడింది. దీంతో శ్వాస ఆడక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాణాలు విడిచాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు, బంధువులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల ద్వారా పోలీసులు కూడా వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్య చికెన్ వండలేని భర్త ఆత్మహత్య!
భార్య చికెన్ వండలేదన్న కోపంతో ఎనిమిది నెలల క్రితం ఓ భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్‌లో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంట తండాకు చెందిన ఆటో డ్రైవర్ రతన్‌లాల్ (32), రాధిక దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మూడేళ్ల క్రితం వారు బతుకుదెరువు కోసం దుండిగల్‌కు వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 25న సాయంత్రం రతన్‌లాల్ మద్యాన్ని తాగి కోడిమాంసం కొని ఇంటికెళ్లాడు. కోడి కూర వండి పెట్టాలని భార్యకు చెప్పాడు.
అయితే కుమార్తెకు చికెన్ పాక్స్ సోకడంతో చికెన్ కూర వండకూడదని భార్య చెప్పింది. కానీ వినలేదు.వండాల్సిందేనన్నాడు. రతన్ లాల్ భార్య వండడానికి నిరాకరించింది. ఆ తర్వాతి రోజు తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి బయటకు వెళ్లాడు. వచ్చేటప్పుడు యాసిడ్ తాగి ఇంటికొచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. కుమార్తెకు చికెన్ ఫాక్స్ సోకితే.. తగ్గడానికి ఏం చేయాలో ఆలోచించకుండా అదే పనిగా మద్యం తాగుతూ.. చికెన్ కోసం ఏకంగా ప్రాణం తీసుకున్న రతన్ లాల్ వ్యవహారం ఆయన బంధువుల్లోనూ చర్చనీయాంశమయింది. ఇప్పుడు అనాధమారిన ఆయన కుటుంబం పరిస్థితి ఏమిటని వారు చర్చించుకుంటున్నారు.