Nellore Suicides: రైల్వే ట్రాక్‌పై యువతి, యువకుడి మృతదేహాలు - మిస్టరీగా మారిన డెత్స్, వీరిద్దరికీ పరిచయముందా?
Nellore లోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద రైలు పట్టాలపై ఓ యువతి, మరో యువకుడి శవాలు పడి ఉన్నాయి. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఆ శవాలని స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద రైలు పట్టాలపై ఓ యువతి, మరో యువకుడి శవాలు పడి ఉన్నాయి. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఆ శవాలని స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ ఇతర ఆధారాలతో వారిద్దరి కుటుంబ సభ్యులకు కబురు పెట్టారు. అయితే వారిద్దరికీ ముందే పరిచయం ఉందా, లేక వేర్వేరుగా వచ్చి ఇలా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా అనే విషయం తేలాల్సి ఉంది.
అమ్మాయి ఎవరు?
రైల్వే, స్థానిక పోలీసుల సమాచారం మేరకు.. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి అనే యువతి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుకుంటోంది. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఈనెల 10న కాలేజీకి వెళ్లేందుకు ఆమె సిద్ధం కాగా, తండ్రి ఆమెను అయ్యప్పగుడి సెంటర్ వద్ద బైక్ లో వదిలిపెట్టి వెళ్లాడు. కాలేజీ బస్సు ఎక్కిందా లేక, బస్సు ఎక్కకుండా మరో చోటికి వెళ్లిందా అనే విషయం తెలియలేదు. సాయంత్రం అమ్మాయి జాడకోసం చూసిన తల్లిదండ్రులు ఆమె రాకపోయే సరికి షాకయ్యారు. ఫోన్ చేసినా కలవలేదు. స్నేహితుల్ని విచారించినా తెలియదన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక చాలా చోట్ల వెదికారు. కాలేజీ, ఇతర ప్రాంతాల్లో కూడా బంధువులు వెదికారు. అయినా ఫలితం లేదు. అప్పటికే ఆలస్యమైంది. కూతురు ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. శనివారం వేదాయపాళెం పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. తన కుమార్తె కనిపించడంలేదని, వెతికి పెట్టాలని కోరారు. కాలేజీ బస్సు ఎక్కించేందుకు తాను అయ్యప్పగుడి సెంటర్లో వదిలి వెళ్లాలని, అప్పటినుంచి ఆమె జాడ తెలియడంలేదని చెప్పారు.
అబ్బాయి ఎవరంటే?
ఇక రైలుకింద పడి చనిపోయిన వారిలో యువకుడి పేరు జి.నితిన్. వయసు 27 సంవత్సరాలు. బీటెక్ పూర్తి చేసిన నితిన్ ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈనెల 10వ తేదీన ఇంటర్వ్యూ కోసం సూళ్లూరు పేట వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడే ఇంటినుంచి బయలుదేరాడు. అయితే రాత్రయినా అతను ఇంటికి చేరలేదు. దీంతో తల్లిదండ్రులు గాభరా పడ్డారు. స్నేహితులకు ఫోన్ చేసినా సమాచారం లేదు. నితిన్ ఫోన్ కూడా పనిచేయలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరూ తెలిసినవారేనా?
నితిన్, భాగ్యలక్ష్మికి పరిచయం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు నిర్థారించలేదు. ఇద్దరి మృతదేహాలు ఒకేచోట పడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ ఒకే రోజు మిస్ కావడం, ఒకేచోట చనిపోయి పడి ఉండటంతో.. వీరిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉంటుందనే అనుమానాలున్నాయి. ఇద్దరూ అక్కడే చనిపోవడంతో పోలీసులు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. రైల్వే ఎస్సై ఎన్. హరిచందన సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో లభ్యమైన వివరాలు, బైక్ ఆధారంగా మృతులు భాగ్యలక్ష్మి, నితిన్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం నెల్లూరు జీజీహెచ్ కు తరలించారు.