Nellore Ganja Smugglers: అటు గంజాయి, ఇటు అక్రమ మద్యం - నెల్లూరు జిల్లాలో అసలేం జరుగుతోంది !
కారు సీటు కింద ప్రత్యేకంగా ఓ షెల్ఫ్ తయారు చేయించుకుని అందులో గంజాయి ప్యాకెట్లు, మందు బాటిళ్లు తరలించడం వీరికి అలవాటు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారులో సీటు కింద ఏర్పాటు చేసిన అరలో గంజాయి ఉంది.
Ganja Smugglers arrest in Nellore: చేసేది తప్పుడు పని అని తెలిసినా కూడా దాని ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండటంతో చాలామంది ఇదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పోలీసుల కళ్లుగప్పి గంజాయి, మందు అక్రమ రవాణా చేస్తే చాలు చేతిలో డబ్బులు పడతాయనే దుర్భుద్దితో కొందరు ఈ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో జైలుపాలయినా తమ బుద్ధి మార్చుకోవడంలేదు. గంజాయి రవాణా చేస్తూ పదే పదే పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా ఇలా మరోసారి పోలీసులకు చిక్కారు ఇద్దరు కేటుగాళ్లు.
పోలీసుల వరుస తనిఖీలు
అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత నెల్లూరు జిల్లాకు చెందిన కందుకూరులో ఏప్రిల్ 24వ తేదీన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారుని అడ్డుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని వెంబడించారు. అయితే కారుని వదిలేసి వారిద్దరూ పారిపోయారు. కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో అప్పటినుంచి తప్పించుకుని తిరిగుతున్న ఆ ఇద్దరిని కందుకూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఓ చోట గంజాయి, మరోచోట అక్రమ మద్యం
కారు సీటు కింద ప్రత్యేకంగా ఓ షెల్ఫ్ తయారు చేయించుకుని అందులో గంజాయి ప్యాకెట్లు, మందు బాటిళ్లు తరలించడం వీరికి అలవాటు. కందుకూరులో పోలీసులు స్వాధీనం చేసుకున్న కారులో కూడా సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 51 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కందుకూరులోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీనివాస్, రవితేజను సోమవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మరో 20కేజీల గంజాయిని, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను, రూ.20వేల విలువజేసే 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ మన్యం నుంచి వీరిద్దరూ నెల్లూరు జిల్లా కు గంజాయి తరలిస్తున్నారు. ఇక్కడినుంచి ఢిల్లీకి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారు. పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్న 105 కేజీల గంజాయి విలువ 10లక్షలుగా తేల్చారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి పల్నాడు జిల్లాకు చెందిన పాములపాటి శ్రీనివాస్. వృత్తిరీత్యా ఇతను సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తుంటాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసేవాడు.
2016లో రాజమండ్రి పోలీసులు శ్రీనివాస్ ని అరెస్టు చేయడంతో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తరువాత 2021లో మరోసారి ఢిల్లీ పోలీసులకు చిక్కి ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పాల రవితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి మళ్లీ గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారు. వీరిద్దరూ కందుకూరు వద్ద కారుని వదిలేసి పారిపోయారు. తప్పించుకుని తిరిగారు. చివరకు పోలీసులకు చిక్కారు.
Also Read: Whatsapp Ban : ఒక్క నెలలో 18 లక్షల మందికి వాట్సాప్ కట్ - వాళ్లేం చేశారంటే ?