Nalgonda: కట్టుకున్న భార్య తలపై గొడ్డలితో వేటు.. రక్తపుమడుగులో మహిళ, భర్త పరార్
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని రుద్రయ్య భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో అతను కోపం పట్టలేకపోయాడు.
నల్గొండ జిల్లాలో ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. చివరి వరకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త.. తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని గొడ్డలితో నరికి చంపాడు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఏకంగా గొడ్డలితో దాడి చేసి చంపాడు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిడమనూరు మండల పరిధిలోని బొక్కమంతులపాడు గ్రామానికి చెందిన ధర్మారపు రుద్రయ్య, విజయరాజేశ్వరి (36) భార్యా భర్తలు. వీరికి పెళ్లి జరిగి 14 ఏళ్ల దాటింది. వీరికి గణేష్ అనే ఒక కుమారుడు ఉండగా.. అతను అనారోగ్య కారణాలతో గత ఏడాది క్రితం మృతి చెందాడు. అయితే, రుద్రయ్య తన భార్యతోపాటు హైదరాబాద్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. వీరి చిన్న కుమారుడు కూడా వీరితోనే ఉంటున్నాడు.
Also Read: Bandi Sanjay: రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అందుకే అంటున్నడు.. బండి సంజయ్ వ్యాఖ్యలు
అయితే, రుద్రయ్య ఓ శుభకార్యం కోసం సొంతూరికి వచ్చాడు. తన అన్న కూతురి నిశ్చితార్థం ఆదివారం బొక్కమంతులపాడ్‌లో నిర్వహించారు. ఈ శుభకార్యానికి హాజరయ్యేందుకు రుద్రయ్య, రాజేశ్వరి ఉదయం సొంత ఊరికి వచ్చారు. ఆ సమయంలోనే అతనికి మద్యం తాగాలనే ఆలోచన పుట్టింది. ఇందుకోసం డబ్బులు ఇవ్వాలని రుద్రయ్య భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో అతను కోపం పట్టలేకపోయాడు. వెంటనే కోపంతో ఇంట్లోనే ఉన్న గొడ్డలితో ఆమె తలపై వేటు వేశాడు. దీంతో భార్య రాజేశ్వరి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడింది. ఇది చూసి భయపడిపోయిన రుద్రయ్య అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు.
Also Read: Gupta Nidhulu: వరంగల్‌లో గుప్త నిధులు, 1000 బంగారు నాణెల కేసులో 8 మంది అరెస్ట్.. ఎన్నో ట్విస్టులు
వెంటనే ఇరుగుపొరుగు వారు ఈ విషయం గమనించడంతో రాజేశ్వరిని మిర్యాలగూడలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె మార్గ మధ్యంలోనే మృతి చెందింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పడంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించడం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రుద్రయ్యపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. రుద్రయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Nellore: లేడీ కానిస్టేబుల్స్‌కి యూనిఫాం కొలతలు పురుషులతో..! వివాదాస్పదంగా పోలీసుల తీరు