Crime News: కడపలో కన్నీళ్లు పెట్టించే ఘటన- కరెంట్ వైర్లు తగిలి బాలుడి మృతి, మరొకరి పరిస్థితి విషమం
Andhra Pradesh Crime News | కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సైకిల్ పై వెళ్తుండగా కరెంట్ వైర్లు తగిలి, ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు.
Kadapa Tragedy | కడప: కడప జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై ఓ బాలుడు మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప నగరంలోని అగాడివీధిలో టైటానిక్ బిల్డింగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది.
కడపలోని అగాడివీధిలో ఓ సైకిల్ పై తన్వీర్, ఆదాం అనే పదేళ్ల విద్యార్థులు వెళ్తున్నారు. టైటానిక్ బిల్డింగ్ వద్దకు రాగానే కరెంట్ తీగలు తగలడంతో వీరు సైకిల్ పైనుంచి పడిపోయారు. వెనుక వచ్చిన బైకు మీద నుంచి ఓ వ్యక్తి దిగి, వీరికి సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సెకన్ల వ్యవధిలోనే విద్యుత్ తీగలు సైకిల్ ను తాకి ఉండటంతో నిప్పు రవ్వలు వచ్చాయి. ఇద్దరికి తీవ్ర కాలిన గాయాలు కాగా, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మరో బాలుడైనా ప్రాణాలతో బయటపడాలని స్థానికులు కోరుకుంటున్నారు.
ఘోర ప్రమాదం.. కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు పిల్లలకు షాక్.. ఒక పిల్లవాడు మృతి
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2024
కడప జిల్లా టైటానిక్ బిల్డింగ్ వద్ద సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు పిల్లలకు కరెంట్ వైర్లు తగిలి షాక్.. చికిత్స పొందుతు ఒక పిల్లవాడు మృతిచెందగా, మరొక పిల్లవాడికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సిబ్బంది.
సంఘటనా… pic.twitter.com/p3P8gBbYNM
కరెంట్ షాక్ తో విద్యార్థి మృతిచెందడంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారణ వ్యక్తం చేశారు. మరో బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై పోలీసులు, అధికారులను ఆమె ఆరా తీశారు. తీవ్ర గాయాలైన మరో బాలుడికి ఉచితంగా వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. డిష్ వైర్లు, కరెంట్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో సైకిల్ మీద వెళ్తున్న ఓ విద్యార్థి కరెంట్ షాక్ తో చనిపోగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.