(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే
Rajendranagar: ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్ర నగర్ పోలీసులు వివరించారు. వీరు ఇద్దరూ ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు.
పెళ్లికి ఇంకో రెండు రోజులు ఉందనగా వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కాబోయే భర్త చనిపోయాడనే విషయం తెలుసుకున్న వధువు కూడా ప్రాణాలు తీసుకోబోయింది. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్‌లో సోమవారం (మే 23) జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్ర నగర్ పోలీసులు వివరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురానికి చెందిన విజయ్ కుమార్ అనే 30 ఏళ్ల వ్యక్తికి 15 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగింది. ఇతను కడప జిల్లాలోనే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. మనస్పర్థల కారణంగా కొంత కాలం నుంచి భార్యతో దూరంగా ఉంటున్నాడు. మరోవైపు, హైదరాబాద్ టపాఛబుత్రా ప్రాంతానికి చెందిన మహిళతో ఇతనికి గత ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఏడాది కాలం నుంచి వీరు ఇద్దరూ రాజేంద్రనగర్‌లోని ఉప్పర్ పల్లిలో ఓ అపార్ట్ మెంట్‌లో సహజీవనం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని గత నెలే నిర్ణయించుకున్నారు. పెళ్లి దగ్గర పడుతుండగా, వారం రోజుల క్రితం విజయ్ కుమార్ తన ప్రియురాలికి చెప్పకుండా ఎటో పారిపోయాడు. దీంతో ఆమె తన ప్రియుడు కనిపించడం లేదని టపాఛబుత్ర పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయగా, ఆ పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
మొత్తానికి విజయ్ కుమార్‌ను సదరు మహిళను స్టేషన్ పిలిపించిన పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. త్వరలో పెళ్లి ఉన్నందున షాపింగ్ కోసం మహిళ ఒంటరిగా వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న విజయ్ కుమార్ తన కాబోయే భార్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పేశాడు. కంగారు పడిపోయిన మహిళ ఇంటికి చేరుకోగా.. అప్పటికే విజయ్ కుమార్ చనిపోయి ఉన్నాడు.
దీంతో తన ప్రియుడు లేని జీవితం వేస్ట్ అనుకున్న మహిళ తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఎంఎంటీఎస్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవాలని భావించింది. రైలు పట్టాలపై పడుకోగా.. స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వెళ్లి ఆమెను అక్కడి నుంచి రక్షించారు. చనిపోయిన వ్యక్తి శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇతని కుటుంబ సభ్యులు అంతా కడప జిల్లాలోనే ఉండడంతో వారికి సమాచారం అందించినట్లుగా రాజేంద్ర నగర్ పోలీసులు వెల్లడించారు.