Jagitial News: జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో నిర్లక్ష్యం - 10 మంది బాలింతలకు ఊడిపోయిన కుట్లు
Jagitial News: జగిత్యాల మాతా శిశు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం పది మంది ప్రాణాల మీదకు తీసుకు వచ్చింది. డెలివరీ తర్వాత వేసిన కుట్లు ఊడిపోవడంతో పది మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Jagitial Crime News: ఓవైపు తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రభుతాసుపత్రుల్లోనే పురుడు పోసుకోవాలని, అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కానీ పలు ఆసుపత్రుల్లో మాత్రం వైద్యుల నిర్లక్ష్యంతో.. రోగులు ఏమైపోతారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న 10 మంది తల్లులకు వేసిన కుట్లు ఊడిపోయాయి. విషయం గుర్తించిన మహిళలు, వారి తరఫు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు.
ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. నిర్లక్ష్యం చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై నిర్లక్ష్యాన్ని వీడాలని అంటున్నారు. అయితే మహిళలకు మరోసారి కుట్లు వేస్తామని వైద్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎమ్మెల్యేనే ఆపరేషన్ చేయమంటూ గర్భిణీతో గొడవ
ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళను మాటలతో వేధించారు జగిత్యాల మాతా శిశు సిబ్బంది. తనకి డెలివరీ అయ్యే సమయం దగ్గర పడడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో ఉన్న పరిచయం వల్ల మాతా శిశు సిబ్బందికి ఫోన్ చేయించారు. అయితే డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగానే అక్కడ సిబ్బంది నుండి అనుకోని స్పందన ఎదురైంది. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించారు కదా.. ఆ ఎమ్మెల్యేనే వచ్చి ఆపరేషన్ చేయమను అంటూ వెటకారంగా మాట్లాడారు. ఓ వైపు వైద్యుల నిర్లక్ష్యపు మాటలు, మరోవైపు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు నిత్య సౌకర్యాలు అందిస్తున్నా... సిబ్బంది మాట తీరు, ప్రవర్తన వల్ల చాలా సమస్యలు ఎదుర్కుంటున్నామని పలువురు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు.
నర్సును ప్రాధేయపడ్డ కుటుంబం..
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన షెర్ఫీ డెలివరీ కోసం ఈనెల 18వ తేదీన జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ లో చేరింది. మొదటి కాన్పు కావడంతో నార్మల్ డెలివరీ చేయాలని డాక్టర్లు, సిబ్బంది వేచి చూశారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు నొప్పులు రావడం, ఉమ్మ నీరంతా పోవడంతో కుటుంబ సభ్యులు భయపడ్డారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఏదో ఒకటి చేసి తమ బిడ్డను కాపాడాలంటూ నర్సును ప్రాధేయపడ్డారు. అయితే ఆ నర్సు నిర్లక్ష్యంగా మాట్లాడింది. దీంతో ఎమ్మెల్యేకు ఫోన్ చేయించారు కుటుంబ సభ్యులు. స్పందించిన ఎమ్మెల్యే ఆస్పత్రికి ఫోన్ చేసి తక్షణ వైద్య సాయం అందించాలని కోరారు. దీంతో కోపం పెంచుకున్న సిబ్బంది ఎమ్మెల్యేనే వచ్చి ఆపరేషన్ చేయమనండి అంటూ ఫైర్ అయ్యారు. అదంతా పట్టించుకోకండి, వైద్యం చేయమని కాళ్లు పట్టుకున్నా కనికరించలేరు. మీరేం చేసినా మేం వైద్యం చేయమంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పారు. దీంతో షెర్ఫీని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.