Jagtial Fake Currency Gang Arrest : జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల చెలామణి గ్యాంగ్ అరెస్ట్, రూ.15 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
Jagtial Fake Currency Gang Arrest : జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగనోట్ల కలకలం రేపింది. నకిలీ నోట్లను మారుస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు రూ.15 లక్షల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
Jagtial Fake Currency Gang Arrest : జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. భారీ ఎత్తున నకిలీ నోట్లను మార్పిడికి ప్రయత్నించిన ఓ ముఠాని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన మేక శేఖర్ అనే వ్యక్తి గతంలో దొంగనోట్ల చలామణిలో అరెస్టై జైలుకు కూడా వెళ్లివచ్చాడు. 2003 నుంచి ఈ దందాను నడిపిస్తున్న శేఖర్ పై మహారాష్ట్రలో కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో జైలు జీవితం అనుభవించాడు. మళ్లీ అదే దందాలోకి దిగడానికి తన మిత్రులైన రాధాకిషన్ అనే వ్యక్తిని పురికొల్పాడు. దీంతో రాధా కిషన్ గోదావరిఖనికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ గౌడ్, హనుమకొండకు చెందిన విజ్జగిరి భిక్షపతితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి భిక్షపతికి వరసకు సోదరుడైన విజ్జగిరి శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా సదరు దొంగనోట్లను మార్చడానికి ఓ పార్టీని సంప్రదించడానికి ప్రయత్నించారు. శ్రీకాంత్ కూడా సరైన పార్టీ దొరికే వరకు వేచి చూసి ఏకంగా దాదాపు 15 లక్షల రూపాయల విలువైన దొంగనోట్లు కావాలి అని చెప్పాడు. దీంతో శేఖర్ రాధాకిషన్, శ్రీనివాస్ గౌడ్ ముగ్గురూ కలిసి లక్సెట్టిపేట నుంచి బయలుదేరిరాగా భిక్షపతి, శ్రీకాంత్ ఇద్దరు కలిసి జగిత్యాలలోని న్యూ బస్టాండ్ వద్దకి వరంగల్ నుంచి చేరుకొని మార్పిడి కోసం ప్రయత్నించారు. దీనికై దాదాపు మూడు లక్షల రూపాయలను సిద్ధంగా ఉంచుకుని ఉదయం 9 గంటలకు టైం ఫిక్స్ చేసుకున్నారు. చిన్నపిల్లలు ఆడుకునే నోట్లను పకడ్బందీగా మోసం చేస్తూ కీలకమైన పండుగల సమయంలో లేదా ఇతర జాతరలు జరిగే సమయంలో అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని వేసిన పథకాన్ని జగిత్యాల పోలీసులు ముందస్తు సమాచారంతో బట్టబయలు చేయగలిగారు.
ఎవరీ శేఖర్?
మంచిర్యాలలోని దండేపల్లి మండలం తల్లపేట గ్రామానికి చెందిన 49 ఏళ్ల మేక శేఖర్ పకడ్బందీగా ప్లాన్ చేసి నోట్ల మార్పిడికి పాల్పడేవాడు. అయితే 2004లో సుల్తానాబాద్ లో అదే సంవత్సరం హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. 2003లో నాందేడ్ లో , 2005లో ఔరంగాబాద్ లో, 2006లో సోమగూడెం, 2008 సంవత్సరంలో ఇంద్రవెల్లిలో, 2012 గడ్చిరోలిలో ఇదే దందాలో అరెస్టయ్యాడు. అయినా ఏ మాత్రం తీరు మార్చుకోని శేఖర్ జైలుకు వెళ్లి రావడం అలవాటుగా మార్చుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ముఠా సభ్యులను ఎంచుకోవడం నోట్ల మార్పిడికి పాల్పడి జంప్ కావడం శేఖర్ స్టైల్. వృత్తి వ్యవసాయం అని అందరికీ చెప్పుకునే శేఖర్ ఎవరి కంటా పడకుండా దొంగ నోట్లు మార్చడానికి ప్రయత్నించి మరోసారి జగిత్యాల పోలీసుల ఉచ్చులో చిక్కాడు. వీరిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ సింధూ శర్మ , అడ్మిన్ ఎస్పీ రూపేష్ అభినందించారు.