Jagitial Crime News: ఎస్సై కారణంగా చనిపోతున్నానంటూ స్టేటస్, ఆపై ఆత్మహత్యాయత్నం!
Jagitial Crime News: తన చావుకు ఎస్సై కారణమంటూ వాట్సాప్ లో సెల్ఫీ వీడియో పెట్టి మరీ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడో యువకుడు. దీనిపై స్పందించిన సదరు ఎస్సై ఏమన్నారంటే..?
Jagitial Crime News: ఎస్సై కారణంగానే తాను చనిపోతున్నానంటూ వాట్సాప్ లో స్టేటస్ లో సెల్ఫీ వీడియో పెట్టాడో యువకుడు. అనంతరం పురుగుల మందు తాగి మరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. అయితే యువకుడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇదే విషయమై సదరు ఎస్సైను వివరణ కోరగా.. ఆయన స్పందించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన నక్కఅనిల్.. తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని కొందరు కబ్జా చేశారంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే సదరు ఎస్సై లంచం ఇస్తే భూమిని ఇప్పిస్తానని చెప్పడంతో తాను మూడు లక్షల రూపాయలను ఎస్సైకు ఇచ్చినట్లు వివరించారు. ఆ తర్వాత తన భూమిని తనకు ఇప్పించకపోగా డబ్బులు అడిగేత తనపై పలు కేసులతోపాటు రౌడీ షీట్ తెరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యకు పాల్పడ్డానని వివరించారు. అయితే తన చావుకు ఎస్సై కారణం అంటూ ముందుగా వాట్సాప్ లో స్టేటస్ పెట్టానని... అనంతరం పురుగుల మందు తాగానని చెప్పుకొచ్చారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు తనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని వివరించారు.
ఈనెల 10వ తేదీన అనిల్ తన వాట్సాప్ స్టేటస్ లో ఎస్సై కారణంగా చనిపోతున్నానంటూ స్టేటస్ లో ఓ సెల్ఫీ వీడియో పెట్టడం వివాదంగా మారింది. ఈ విషయంపై మల్యాల ఎస్సై చిరంజీవిని వివరణ కోరగా... పలువురు బాధితుల మేరకు నక్క అనిల్ పై 8 కేసులు నమోదు అయ్యాయని.. ఉన్నతాధికారుల సూచన మేరకు అతడిపై రౌడీషీట్ తెరిచామని తెలిపారు. ఈ కేసులను తొలగించాలని.. తమపై ఒత్తిడి తెచ్చేందుకే అని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వివరించారు. తాను డబ్బులు తీసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేసిన అనిల్ భూమికి సంబంధించిన కేసు చార్జిషీటు కూడా సిద్ధంగా ఉందన్నారు.
స్టేటస్ పెట్టిన సెల్ఫీ వీడియోలో ఏముందంటే..?
"నేను వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. నాకు ఒక బ్లేడ్ బండి ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన 20 కుంట్ల భూమి ఉంది. దానిని కబ్జా చేశారు. ఈ విషయాన్ని ఎస్ఐ దృష్టికి తీసుకెళ్తే కబ్జా చేసిన భూమి ఇప్పించేందుకు రూ.3 లక్షలు తీసుకున్నారు. డబ్బులు తీసుకుని నాకు భూమి ఇప్పించలేదు. డబ్బులు తిరిగిమ్మని అడిగినందుకు నాపై అక్రమంగా ఏడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి కొట్టి బలవంతంగా సంతకం చేయించాలని చూశారు. నేను సంతకం పెట్టకపోయేసరికి ఎస్ఐ నా సంతకం ఫోర్జరీ చేశారు. ఎస్ఐ నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే నాపై పీడీ యాక్ట్ పెడతానని బెదిరించారు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను చనిపోతున్నా నా కుటుంబానికి న్యాయం చేయండి" -సెల్ఫీ వీడియోలో అనిల్