(Source: Poll of Polls)
Vanasthalipuram Robbery : దోపిడీ కాదు హవాలా లింక్, వనస్థలిపురం రూ.2 కోట్ల చోరీ కేసులో ట్విస్ట్
Vanasthalipuram Robbery :హైదరాబాద్ వనస్థలిపురంలో కలకలం రేపిన చోరీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. రూ.2 కోట్లు దోపిడీ కథ ఏంటో పోలీసులు తేల్చారు.
Vanasthalipuram Robbery : వనస్థలిపురంలో అర్ధరాత్రి రూ.2 కోట్ల డబ్బు తీసుకుని వెళ్తుండగా దోపిడీ దొంగలు ఎటాక్ చేసి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారని రెండ్రోజుల క్రితం బార్ యజమాని వెంకట్రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదంతా నిజమేనని జనాలతోపాటు పోలీసులు అనుకున్నారు. కానీ తమదైన స్టైల్లో ఇంటరాగేషన్ చేసిన కాప్స్ ఇదంతా హవాలా మాయా అంటూ అసలు నిజం తేల్చారు.
శుక్రవారం రాత్రి ఏం జరిగింది?
శుక్రవారం రాత్రి వనస్థలిపురంలో ఓ దోపిడీ కేసు వెలుగుచూసింది. వనస్థలిపురంలోని ఎంఆర్ఆర్ బార్ యాజమాని కలెక్షన్ సొమ్ముతో ఇంటికి బయల్దేరాడు. గుర్తు తెలియని దుండగులు తనను ఫాలో అయ్యి..వెంకట్రామిరెడ్డి బైకును ఢీకొట్టి డబ్బుతో ఎస్కేప్ య్యారనేది స్టోరీ. దోచుకెళ్లిన సొత్తంతా బారు లావాదేవీలకు సంబంధించిందేనని అంతా అనుకున్నారు. బట్..ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ ఇంత భారీ మొత్తంలో లిక్విడ్ క్యాష్ ఎలా ఉంటుందని పోలీసులకు డౌట్ వచ్చింది.
హవాలా గుట్టు విప్పిన వాట్సప్
కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తనదైన స్టైల్లో విచారణ మొదలు పెట్టారు. బాధితుడికి తెలిసిన వ్యక్తులే ఇదంతా చేశారనే అంచనాకు వచ్చారు. దర్యాప్తులో బార్ ఓనర్ వెంకట్రామిరెడ్డి కాల్ డేటా, వాట్సప్ హిస్టరీపై ఓ కన్నేశారు. అప్పుడు అసలు గుట్టు బయటపడింది. హవాలా బాగోతం వెలుగులోకి వచ్చింది. బార్ ఓనర్ వాట్సప్ ఆధారంగా హవాలా లింకులు గుర్తించారు పోలీసులు. ఓల్డ్ సిటీకి చెందిన ఫరూఖ్ తో కలిసి వెంకట్రామిరెడ్డి హవాలా చేస్తున్నాడని గుర్తించారు.
హవాలా రూపంలో అమెరికా నుంచి రూ.28 కోట్లు
బార్ ఓనర్ వెంకట్రామిరెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు. హవాలా లావాదేవీలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని ఫరూఖ్ తో వెంకట్రామిరెడ్డికి లింకులున్నట్టు తేల్చారు. ఓ ఎన్నారై పంపిస్తున్న డబ్బులు హైదరాబాద్లో చేతులు మారుస్తున్నట్టు కాప్స్ గుర్తించారు. ఇప్పటివరకు అమెరికా నుంచి రూ.28 కోట్ల హవాలా రూపంలో మార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న షారుఖ్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు.