తెలంగాణ అసెంబ్లీ సమీపంలో తుప్పుపట్టిన రివాల్వర్ల ప్రత్యక్షం!
Guns Found In TS Assembly: హైదరాబాద్ అసెంబ్లీ సమీపంలో తుప్పు పట్టిన రివాల్వర్లు ప్రత్యక్షం అయ్యాయి. 1 తపంచ, 2 కంట్రీ మేడ్ రివాల్వర్లు దొరకగా.. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Guns Found In TS Assembly: తెలంగాణ రాజధాని నగరం అయిన హైదరాబాద్ అసెంబ్లీ సమీపంలో తుప్పు పట్టిన రివాల్వర్లు ప్రత్యక్షం అయ్యాయి. అసెంబ్లీ ఆవరణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చెట్లను శుభ్రం చేస్తుండగా.. 3 రివార్వర్లు కనిపించాయి. చెట్ల పొదల్లో 1 తపంచ, 2 కంట్రీ మేడ్ రివాల్వర్లు దొరికాయి. విషయం గుర్తించిన సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు 3 రివార్వర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెస్తున్నారు.
ఈరోజు ఉదయమే మాదాపూర్ లో తుపాకీతో రియల్టర్ హల్ చల్
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాలీవుడ్ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు భూమిలో జరుగుతున్న కన్‌స్ట్రక్షన్ వద్ద ఓ వ్యక్తి తుపాకీతో హల్ చల్ చేశాడు. అయితే గత కొంత కాలంగా దగ్గుపాటి సురేష్ బాబుకు, రామకృష్ణారెడ్డికి మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం సురేష్ బాబు భూమిలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి సంజీవరెడ్డి అనే ఓ వ్యక్తి కాంట్రాక్టు తీసుకున్నాడు. తన భూమిలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారనడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. ఇదే విషయమై మొదట మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో దగ్గుపాటి సురేష్ బాబు సూపర్ వైజర్ ఫిర్యాదు చేశారు. నిన్న మధ్యాహ్నం మరోసారి రామ కృష్ణారెడ్డి రావడంతో వివాదం మొదలైంది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ సంజీవ రెడ్డికి రామ కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే తీవ్ర కోపోద్రిక్తుడైన కాంట్రాక్టర్ సంజీవ రెడ్డి తన వద్ద ఉన్న తుపాకీని తసి రామకృష్ణారెడ్డిని బెదిరించాడు. గాల్లోకి కాల్పులు జరిపాడు.
వెంటనే అక్కడి నుంచి వచ్చేసిన రామకృష్ణారెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంజీవ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరించడానికి ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాదాపూర్ లో కాల్పుల కలకలం...
హైదరాబాద్ లో రెండు నెలల క్రితం కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ లోని నీరూస్ సిగ్నల్ వద్ద ఉదయం మూడు గంటల సమయంలో రౌడీ షీటర్ ను దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రౌడీ షీటర్ ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్ లో మరో రౌడీషీటర్ ముజ్జు కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ కారులో వెళుతుండగా.. మాదాపూర్ నీరూస్ వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ముజ్జు అతడిని ఆపాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ముజ్జు ఆరు రౌండ్‌లు కాల్పులు జరపాడు. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో ఇస్మాయిల్ అక్కడిక్కడే మరణించాడు. అయితే ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయ పడ్డాడు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ..
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా.. ముజ్జు, ఇస్మాయిల్ ఇద్దరూ స్నేహితులేనని తెలుస్తోంది. వీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ముజ్జు అరే మైసమ్మ టెంపుల్ సమీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదో గ్యాంగ్ వార్(Gang war)గా తెలుస్తోంది. జైల్లో ఏర్పడ్డ పరిచయంతో ఇరువురు సెటిల్మెంట్‌ల కోసం ముఠాగా ఏర్పడినట్టు సమాచారం.