Hyderabad Road Accident: శామీర్ పేటలో ప్రైవేటు బస్సు విధ్వంసం - భార్య కళ్లెదుటే భర్త మృతి, మరో ముగ్గురికి గాయాలు
Hyderabad Road Accident: మితిమీరిన వేగంతో బస్సు నడిపిన ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ కారణంగా.. భార్య కళ్లెదుటే ఓ భర్త ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Hyderabad Road Accident: మితిమీరిన వేగంతో బస్సు నడపడమే ఓ కుటుంబం రోడ్డుపాలయ్యేందుకు కారణం అయింది. ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ బస్సును వేగంగా నడపడంతో అదుపతప్పి విధ్వంసం సృష్టించింది. కార్లు, బైకులను ఢీకొడుతూ దూసుకెళ్లింది బస్సు. ఈ ఘటనలో ఓ వ్యక్తి.. భార్యను పుట్టింటి నుంచి తీసుకెళ్తూ ఆమె కళ్లెదుటే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ శ్రీసాయి ట్రావెల్స్ కు చెందిన ఓ ప్రైవేటు బస్సు శంషాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తోంది. ఆదివారం రాత్రి 8.10 గంటల సమయంలో వైఎంసీఏ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడడంతో వాహనదారులు అందరూ ఆగి ఉన్నారు. మేడ్చల్ తిమ్మాపురంవాసి బి. మహేష్ మితిమీరిన వేగంతో బస్సు నడుపుతూ వచ్చి ఆగి ఉ్న వాహనాలను ఢీకొట్టాడు. ఇలాగే కొంత దూరం వరకు వెళ్లాడు. ఇదే సమయంలో బైక్ పై వస్తున్న తూంకుంట పురపాలక సింగాయిపల్లికి చెందిన 35 ఏళ్ల సందీప్ గౌడ్ బస్సు కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనాలపై ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరిని గాంధీకి తరలించగా.. సూరారం కాలనీకి చెందిన వినయ్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్ మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మూడు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ చెబుతున్నాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులంతా కలిసి డ్రైవర్ ను పట్టుకున్నారు. ఇంత వేగంగా ఎలా వస్తావని ప్రశ్నిస్తూనే డ్రైవర్ ను చితకబాదారు. అయితే ప్రమాదంలో మృతి చెందిన సందీప్ గౌడ్ కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో పుట్టింట్లో ఉన్న భార్యను ఆదివారం సాయంత్రం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చెరోవైపు పడిపోయారు. సందీప్ పైనుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన కళ్లముందే భర్త చనిపోవడం చూసిన ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్థానికులంతా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా గుండలవిసేలా ఆమె రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టేలా చేసింది.
ఛాతీలో నొప్పి - బస్సులోంచి దూకేసిన డ్రైవర్
ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండె పోటు రావడంతో అతడు బస్సులోంచి కిందకు దూకేశాడు. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 6 గంటలకు ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న TS 20Z 0015 సూపర్ లగ్జరీ బస్సు ఆసిఫాబాద్ లోని అయ్యప్ప గుడి సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్ సదయ్యకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో అతను హఠాత్తుగా బస్సులోంచి కిందకు దూకేశాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తాపడిన ఆర్టీసీ బస్సులో 7 గురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కు ఛాతిలో నొప్పి రావడంతోనే బస్సులో నుంచి దూకేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్ కి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తాపడిన ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.