Dammaiguda Girl Case: దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ - కేసు ఛేదించిన పోలీసులు
Dammaiguda Girl Case: దమ్మాయిగూడ బాలిక మృతి కేసును పోలీసులు ఛేదించారు. మూత్ర విసర్జన కోసం వెళ్లిన బాలిక ప్రమాద వశాత్తు చెరువులో పడి చనిపోయిందని తెలిపారు.
Dammaiguda Girl Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దమ్మాయిగూడ బాలిక మృతి కేసును పోలీసులు ఛేదించారు. బాలిక మూత్ర విసర్జన కోసం చెరువు వద్దకు వెళ్లిందని.. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయి చనిపోయినట్లు తేల్చారు. ఆడుకునేందుకు బయటకు వచ్చిన ఇందు చెరువు వద్దకు వెళ్లడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. గాంధీ ఫోరెన్సిక్ టీం పోస్టు మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పోస్టుమర్టం నివేదికలో వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. ఇందు మిస్ అయిన మరుసటి రోజు నీటిలో పడినట్లు రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అయిందని... కానీ ఘనటపై పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడ గంజాయి బ్యాచ్, ఎక్కువ మంది అక్కడ మద్యం సేవించడం వంటివి జరుగుతుంటాయని చెప్పడంతో.. పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలిక తల్లిదండ్రుల మైబైల్ ఫోన్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ లోని దమ్మాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. గురువారం అదృశ్యమైన పదేళ్ల బాలిక శుక్రవారం ఉదయం చెరువులో శవంగా తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీశారు. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రి నరేష్ తో పాటు బడికి వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచి పెట్టి పుస్తకాలు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు పాఠాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే బాలిక వెళ్లిపోయిన విషయం తనకు తెలియగానే.. ఇందు తండ్రికి ఫోన్ చేసి ప్రిన్సిపల్ విషయం చెప్పారు. హుటాహుటిన బడికి వచ్చిన బాలిక తండ్రి చుట్టుపక్కల వెతికారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం నాలుగు గంటలకు కేసు నమోదు చేసుకొని ఇందూ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రమాదమా, హత్యా అనే కోణంలో కొనసాగిన దర్యాప్తు
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు పోలీసులు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్తా వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియ రాలేదు. డాగ్ స్వ్కాడ్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఈరోజు ఉదయం మృతదేహం లభ్యం కావడంతో శవాన్ని బయటకు తీశారు. బాలికను ఎవరైనా హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ ఏరియాలో గంజాయి ముఠాలు, తాగుబోతులు ఎక్కువగా సంచరిస్తారని వారే ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. నిన్ననే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఉంటే ఆధారాలు లభించేవని తల్లిదండ్రులు తెలిపారు. బాలిక ఒక్కతే బయటకు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దీన్ని బట్టి పోలీసులు బాలిక ఏమైనా ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయిందా అనే కోణంలో ఆలోచించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.