Hyderabad Crime News: అయ్యో సెల్ఫీ ఎంత పని చేసింది? కర్ణాటకలో హైదరాబాద్ యువకుడు మృతి
Karnataka Hebbe Waterfalls: హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. కర్ణాటకలోని హెబ్బె జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ నీటిలో పడి మరణించారు.
Hyderabad Man Dies In Hebbe waterfalls: విహారయాత్ర విషాదయాత్ర అయ్యింది. స్నేహితుడితో కలిసి సరదాగా కర్ణాటక విహారయాత్ర (Karnataka Tour) కు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు(Hyderabad Man) మృత్యువాత పడ్డాడు. ప్రకృతి ఒడిలో సరదాగా గడుపుతూ, ఫొటోలు తీసుకుంటూ జలపాతం నీటిలో జారిపడి ప్రాణాలు విడిచాడు.
స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ (25) ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల స్నేహితుడితో కలిసి చిక్కమంగళూరు విహారయాత్రకు వెళ్లాడు. స్థానికంగా ద్విచక్రవాహనం అద్దెకు తీసుకుని తీసుకుని చిక్కమగళూరు చుట్టుపక్కల పర్యటక ప్రాంతాలను సందర్శించారు. ఈ క్రమంలో సోమవారం కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం చూడటానికి వెళ్లారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
సెల్ఫీ తీసుకుంటూ..
శ్రవణ్ (25), అతని స్నేహితుడు జలపాతం వద్ద సెల్ఫీ తీసుకునేందుకు యత్నించి కాలుజారి నీటిలో పడిపోయారు. స్థానికులు వారిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. నీటిలో పడిపోయే క్రమంలో బండరాయి తగిలి శ్రవణ్ తలకు తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావమైన శ్రవణ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శ్రవణ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
కర్ణాటకకు పెరిగిన పర్యాటకులు
వర్షాకాలం ప్రారంభం కావడంతో కర్ణాటకలోని పలు జలపాతాలు ప్రకృతి శోభను సంతరించుకున్నాయి. దట్టమైన అడవులు, ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. అందులోను చిక్కమగళూరు జిల్లా డజన్ల కొద్దీ జలపాతాలకు నిలయం. అందుకే చిక్కమగళూరును కర్ణాటక పర్యాటక స్వర్గ సీమ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం వస్తే ఇక్కడి జలపాతాలు నీటితో పాటు పర్యాటకులతో సందడి చేస్తాయి. ఇక్కడి జలపాతాలను చూసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, కేరళ నుంచి సందర్శకులు వస్తుంటారు.