Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్
Ganja Used At Birthday Party In Hyderabad: హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ మండలంలో ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. బర్త్ డే పార్టీలో గంజాయి వాడినట్లు పోలీసులు గుర్తించారు.
Ganja Used At Birthday Party In Hyderabad:
హైదరాబాద్ శివారులో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో గంజాయి వాడకం కలకలం రేపింది. నగర శివారులోని హయత్‌నగర్ మండలం పసుమాముల వద్ద ఓ ఫామ్‌హౌస్‌పై శనివారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఫామ్ హౌస్ లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వినియోగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బర్త్ డే పార్టీని భగ్నం చేశారు. పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వాడుతూ ఎంజాయ్ చేస్తున్న మొత్తం 30 మంది వరకు యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఓ బీటెక్ కాలేజీ స్టూడెంట్ పుట్టినరోజు వేడుకలకు తోటి బీటెక్ స్టూడెంట్స్ ను ఆహ్వానించినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఆ విద్యార్థుల నుంచి 10 కార్లు, బైకులు, 28 వరకు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పుట్టినరోజు పార్టీ ఎవరిచ్చారు, గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారు, పార్టీ నిర్వాహకులు ఎవరు అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్‌లో పెరుగుతున్న గంజాయి, డ్రగ్స్ కేసులు..
కర్ణాటక నుంచి హైదరాబాద్ కు హెరాయిన్ తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎసోటి ఎల్బీనగర్, సరూర్ నగర్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రాంతానికి చెందిన నివాస్ వెంకట రంగనాథ చారి బంధువులు, ఇద్దరు మణికొండలో నివసించేవారు. 2017లో డిగ్రీ చదివే సమయంలో నివాస్ కు మహమ్మద్ షాద్ పరిచయం అయ్యాడు, బెంగళూరులో నివసించే మహమ్మద్ సార్ సయ్యద్ అమీర్ అనే వ్యక్తి నుండి మాదకద్రవ్యాలు సేకరించి నివాస్ కి పంపించేవాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ ఎల్బీనగర్, సరూర్ నగర్ పోలీసులు కర్మన్ ఘాట్ లోని రంగనాథ చారి ఇంట్లో రైడ్ చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల హీరోయిన్ నాలుగు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. మాదకద్రవ్యాలను తయారు చేయడం కొనుగోలు అమ్మకాలపై ఎన్ డి పి ఎస్ సెక్షన్ 31a ప్రకారం మరణశిక్ష విధించే అవకాశం ఉందని కావున యువత తప్పుడుదారి ఎంచుకుని జీవితాలు పాడు చేసుకోవద్దని రాచకొండ సిపి మహేష్ భగవత్ కోరారు.
నేరేడ్ మెట్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు నిషేధిత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 750 గ్రాముల ఓపీయం, 500 గ్రాముల పాపిస్ట్రా, ఓ ఇన్నోవా కారు, బైకుతో పాటు 5 మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి నిషేధిత మాదక ద్రవ్యాలైన ఓపీయం, పాపిస్ట్రాను హైదరాబాద్ కు తీసుకొచ్చి నగరంలో యువతకు విక్రయిస్తున్న రమేష్ బిష్ణోయ్అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
5 నెలల క్రితం రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రమేష్ జీడిమెట్లలోని ఓ ట్రావెల్స్ లో పనిచేస్తున్నాడు. ఆర్థిక అవసరాల కోసం ఈజీగా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతో రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తీసుకొస్తున్నాడు. నగరంలోని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్ లో నివాసం ఉండే విష్ణు, సునీల్, అర్జున్ రామ్ కి విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు సరిగ్గా సమయానికి అక్కడికి చేరుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12 లక్షల విలువచేసే మాదకద్రవ్యాలను, రూ. 65 వేల నగదు, ఓ ఇన్నోవా కారు, ఓ బైక్, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.