Naveen Murder Case: హయత్ నగర్ మర్డర్ కేసు, నిందితుడికి 14 రోజుల రిమాండ్
Naveen Murder Case: తాను ప్రేమిస్తున్న అమ్మాయితో క్లోజ్ గా ఉన్నాడని నవీన్ ను చంపిన హరిహర కృష్ణను హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. ధర్మాసనం 14 రోజుల రిమాండ్ విధించింది.
Naveen Murder Case: తాను ప్రేమిస్తున్న అమ్మాయితో తన స్నేహితుడు చనువుగా ఉంటున్నాడని కోపం పెంచుకున్న హరిహర కృష్ణ స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు అయిన హరిహరి కృష్ణను పోలీసులు హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే ధర్మాసనం 14 రోజుల రిమాండ్ విధించగా.. నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. హరిహర కృష్ణ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి. అయితే ఇతను గతంలో దిల్ షుక్ నగర్ లోని జూనియర్ కళాశాలలో నవీన్, హరిహరికృష్ణ, సదరు యువతి క్లాస్ మేట్స్. అప్పట్లో నిందితుడు హరికృష్ణతో సదరు యువతి చనువుగా ఉండేది. మృతుడు నవీన్ నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈనెల 17వ తేదీన సాయంత్రం ఫోన్ చేసి ఓఆర్ఆర్ వద్దకు పిలిపించిన నిందితుడు హరికృష్ణ.. నవీన్ ను చెట్లపొదల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం పోలీసుల వద్ద లొంగిపోయాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే నవీన్ కనిపించడం లేదంటూ ఈనెల 22వ తేదీన నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఆయన తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే నల్గొండ ఎంజీ యూనివర్సిటీకి చెందిన నవీన్ హత్య కేసులో దర్యాప్తు జరుగుతుందని ఎల్బీనగర్ డీసీపి సాయి శ్రీ తెలిపారు. ఇప్పటికే నిందితుడు హరిహర కృష్ణను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును విచారణ చేస్తున్నామన్నారు. హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనేది తేలాల్సి ఉందన్నారు. ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్యగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. హరికృష్ణ.. నవీన్ ను అతి కిరాతకంగా పొడిచి చంపాడని.. ఇందులో అమ్మాయి పాత్ర ఎంత వరకు ఉందో విచారిస్తున్నాం అన్నారు. అయితే నవీన్, హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులని డీసీపీ వెల్లడించారు. తమ కన్న కొడుకులా చూసుకున్న హరిహరకృష్ణ తమ కుమారుడిని ఇంత దారుణంగా హతమారుస్తాడని భావించలేదని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవీన్ ను చంపినట్లు సదరు యువతికి వాట్సాప్ చేసిన హరి
నవీన్ ను హత్యే చేసిన తర్వాత హరి.. ఆ విషయాన్ని తాను ప్రేమిస్తున్న అమ్మాయికి వాట్సాప్ ద్వారా తెలిపాడు. అంతేకాకుండా నవీన్ వేలును, పెదాలను, గుండెను కోసి బయటకు తీశాడు. వాటిని ఫొటోలుగా తీసి... ఈ వేలే కదా నిన్ను తాకింది, ఈ పెదాలే కదా నిన్ను కోరింది , ఈ గుండెనే కదా నిన్ను ప్రేమించిందంటూ ఫొటోల కింద రాస్తూ వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పెట్టాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఇవన్నీ చదివిన అమ్మాయి జోక్ అనుకుందో లేక ఏమనుకుందో తెలియదు గానీ... అవునా.. ఓకే, వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ హత్య కేసులో అమ్మాయి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఎల్బీ నగర్ డీసీపీ తెలిపారు.