Hyderabad Crime News: చందానగర్ లో దారుణం, కన్నకూతురి కళ్లెదుటే భార్యను చంపిన భర్త
Hyderabad Crime News: పట్ట పగలే.. అంతా చూస్తుండగా, ముఖ్యంగా కన్నకూతురు కళ్లెదుటే ఓ భర్త భార్యను నరికి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
Hyderabad Crime News: హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు దంపతుల మధ్య గొడవల కారణంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. భార్యపై విపరీతమైన కోపం పెంచుకున్న భర్త.. ఆమె పని చేసే చోటుకి వెళ్లి మరీ కత్తితో దాడి చేశాడు. అంతా చూస్తుండగా ముఖ్యంగా కన్నకూతురి ఎదుటే.. పట్టపగలు దారుణంగా నరికి చంపాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ లోని చందానగర్ లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల అంబికకు గతంలోనే సురేందర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. కానీ గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. దీంతో భార్య అంబిక.. భర్తకు దూరంగా వచ్చేసింది. వేరే ఇంట్లో ఉంటూ కూతురితో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే బతుకు దెరువు కోసం నల్లగండ్ల బాటా షోరూం పైన ఉన్న శ్వాస బోటిక్ లో పని చేస్తోంది. అయితే భార్య అంబికపై విపరీతమైన కోపం పెంచుకున్న సురేందర్ ఆమెను ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాడు. ఈరోజు కత్తి తీసుకొని ఆమె పని చేస్తున్న చోటుకు వచ్చాడు. అంతా చూస్తుండగా.. పట్టపగలే కత్తితో ఆమె పీక కోశాడు. తీవ్ర గాయాలపాలైన అంబిక అక్కడికక్కడే మరణించింది. అదే సమయంలో వారి కూతురు కూడా అక్కడే ఉంది. కళ్లెదుటే తండ్రి.. తన అమ్మను చంపడం చూసిన చిన్నారి భయంతో గజగజా వణికిపోతోంది.
అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాపను కూడా పోలీసులు వారి వెంటే తీసుకెళ్లారు. అంబిక బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య అంబిక మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతోనే భర్త సురేందర్ ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. అలాగే నిందితుడు సురేందర్ కోసం గాలిస్తున్నామని చందానగర్ పోలీసులు వివరించారు.
ఇటీవలే ములుగులో యువకుడిని నరికి చంపిన యువతి
ములుగు జిల్లా ఏటూరు నాగారం మూడో వార్డు ఎర్రెళ్లవాడలో.. జాడి సంగీత అనే యువతి తన అమ్మమ్మతో కలిసి ఉంటోంది. ఆమెకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూ లేరు. ఈ క్రమంలోనే వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. అయితే అదే పట్టణానికి చెందిన పాతికేళ్ల రాంటెంకి శ్రీనివాస్ కు ఇది వరకే వివాహం అయింది. కానీ మనస్పర్థల కారణంగా భార్యా, పిల్లలు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం అతడు ఒంటరిగానే ఉంటున్నాడు. మద్యం తాగి రాత్రి వేళ తరచుగా సంగీత ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఆమెను వేధించేవాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ బలవంతం చేసేవాడు. అది తట్టుకోలేని సంగీత.. కొన్ని నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. బెయిల్ పై బయటకు వచ్చిని శ్రీనివాస్.. సంగీతపై కోపం పెంంచుకున్నాడు.
ఈ క్రమంలోనే వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. తాజాగా ఓ రోజు అర్ధరాత్రి మద్యం తాగి సంగీత ఇంటికి వెళ్లాడు. బలవంతం చేస్తూ లైంగిక వాంఛ తీర్చమని నానా రచ్చ చేశాడు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుండడంతో.. కోపోద్రిక్తురాలైన సంగీత.. శ్రీనివాస్ చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం రాత్రి 2 గంటలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి. రమేష్ తెలిపారు.