Hyderabad Crime News: మియాపూర్లో దారుణం - ప్రియురాలిని కత్తితో పొడిచిన యువకుడు!
Hyderabad Crime News: మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసి తనను దూరం పెడుతుందన్న కోపంతో ఆమె, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Hyderabad Crime News: హైదరాబాద్లోని మియాపూర్ లో దారుణం జరిగింది. ప్రియురాలి ఇంటికి వచ్చి మరీ ఆమెపై, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఆపై అదే కత్తితో తన గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచరం ఇవ్వగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
గుంటూరుకు చెందిన 19 ఏళ్ల వైభవి, సందీప్ గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వైభవి.. సందీప్ ను దూరం పెడుతోంది. కానీ సందీప్ మాత్రం ఆమెను వదలడం లేదు. తరచుగా వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నాడు. నిన్ను చంపి నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. మెసేజ్లు పంపుతున్నాడు. ఆమె వాటిని అంతగా పట్టించుకోలేదు.
ఏ నెంబర్ నుంచి ఫోన్, మెసేజ్ చేసినా బ్లాక్ చేయడం ప్రారభించింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన సందీప్... ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మియపూర్ లోని వైభవి ఇంటికి వచ్చాడు. వైభవి తల్లి శోభతో గొడవపడి ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. తర్వాత తను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు శోభ, వైభవిలను కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సందీప్ కు లోతైన గాయం కావడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరు ముగ్గురూ చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు నెలల క్రితం ఓయూలో ఇలాంటి ఘటనే..!
హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో కూడా ఇలానే ప్రేమ పేరుతో ఓ యువతిపై యువకుడు దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ముషిరాబాద్కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమె డిగ్రీ చదువుతోంది.
ముషీరాబాద్ బోలక్పూర్కు చెందిన ఓ యువతి, రంజిత్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఓ విషయంపై గొడప జరిగింది. ఈ గొడవతో రంజిత్ ఆగ్రహానికి గురై తనతో తెచ్చుకున్న ఆయుధంతో యువతిపై దాడి చేశాడు. ఆమె చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం రంజిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమీప హాస్టల్లో ఉన్న విద్యార్థులు విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన యువతిని కాచిగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.