Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Begumbazar Honor Killing : తన భర్తను అన్నలే అతికిరాతకంగా హత్య చేశారని మృతుడి భార్య సంజన ఆరోపించారు. షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ ముందు ఆమె బైఠాయించి నిరసన తెలిపారు.
Begumbazar Honor Killing : బేగంబజార్ పరువు హత్యలో భర్తను కోల్పోయిన సంజన తనకు న్యాయం చేయాలని షాహీనాథ్ గంజ్ పోలీసుస్టేషన్ ముందు బైఠాయించింది. శుక్రవారం రాత్రి బేగంబజార్ లో జరిగిన మర్డర్ కు నిరసనగా ఇవాళ బేగంబజార్ వ్యాప్తంగా వ్యాప్తారస్తులు బంద్ కు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బేగంబజార్ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించారు. షాహీనాథ్ గంజ్ పోలీసుస్టేషన్ కు నీరజ్ కుమార్ పన్వార్ భార్య, అతని కుటుంబీకులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మృతుని బంధువులు, వ్యాపారస్తులు భారీగా చేరుకున్నారు. మృతి చెందిన నీరజ్ పన్వార్ కుటుంబానికి, భార్యకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.
అన్నలే అన్యాయం చేశారు
తాము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మృతుని భార్య సంజన తెలిపారు. తన కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారని తెలిపారు. తాము ఇష్టపూర్వకంగా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నామన్నారు. పెళ్లి చేసుకొని సంవత్సరం గడుస్తుందని, తమకు 2 నెలల బాబు కూడా ఉన్నాడని ఆమె తెలిపింది. తన భర్తను అతికిరాతకంగా చంపింది తన అన్నలే అని సంజన అన్నారు. తన అన్నలే తనకు అన్యాయం చేశారన్నారు. తన భర్తను చంపిన అన్నలను ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తనకు న్యాయం చేయాలని నీరజ్ సతీమణి సంజన కోరుతున్నారు. పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ బేగంబజార్ మచ్చి మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. ప్రేమ వివాహం చేసికున్న జంటను అత్యంత దారుణంగా 20 కత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. ఈ పరువు హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత నిందితులు కర్ణాటక వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు 150 కి.మీ.దూరంలో కర్ణాటకలోని గుడిమిత్కల్‌లో నిందితులను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మర్డర్ కేసులో అనుమానం ఉన్న మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బేగంబజార్ కోల్సావాడికి చెందిన నీరజ్‌కుమార్ పన్వర్(22) పల్లీల వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన సంజన(20)ను ఏడాదిన్నర కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండు నెలల క్రితం బాబు పుట్టాడు. ప్రేమ పెళ్లి ఇష్టంలేని సంజన కుటుంబసభ్యులు నీరజ్ కుమార్ పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. నీరజ్‌ను సంజన సోదరుడు ఆరునెలలుగా చంపాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సంజన సోదరుడు, అతని స్నేహితులు నీరజ్ రోడ్డు దాటుతున్నప్పుడు వెనుక నుంచి గ్రానైట్ రాయితో దాడి చేశారు. రాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం నీరజ్ ను వెంబండించి కొబ్బరిబొండాల కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.